ప్రధాని నరేంద్రమోదీతో భేటీ సహా.. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 8 మందితో కలిసి దిల్లీకి వెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ఆర్థిక సహకారం అందించాలని మంగళవారం ఉదయం ప్రధానికి వినతి పత్రం అందించనున్నట్లు సమాచారం.
ఎన్డీఏలో వైకాపా చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవలె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాల మధ్య సీఎం జగన్ దిల్లీ పర్యటన, ప్రధానితో భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సీఎం పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై తన వాదన వినిపించే అవకాశం ఉంది.