ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: నేడు దిల్లీకి సీఎం జగన్.. పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం..! - సీఎం జగన్​ దిల్లీలో పర్యటన

CM Jagan Delhi Tour: రాష్ట్ర రుణపరిమితిపై సీలింగ్​ను తొలగించే అంశంపై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. నేడు దిల్లీ వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కన్పిస్తోంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్రం వ్యయం చేసిన రూ. 2800 కోట్లను రీయింబర్స్​మెంట్​ చేసే అంశంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికకు మద్దతిచ్చే అంశంపైనా ఇరువురు నేతల మధ్య చర్చ జరగనున్నట్లు సమాచారం.

cm jagan news
cm jagan delhi tour

By

Published : Jun 1, 2022, 3:22 PM IST

Updated : Jun 1, 2022, 11:56 PM IST

CM Jagan Delhi Tour: ముఖ్యమంత్రి జగన్​.. నేడు దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర రుణపరిమితిపై సీలింగ్ ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నారు. ఈ మేరకు స్వయంగా సీఎం జగన్.. ప్రధానితో ఈ అంశాన్ని చర్చించనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం దిల్లీలో ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్.. రాష్ట్ర రుణపరిమితిపై కేంద్రం విధించిన సీలింగ్​ను ఎత్తివేసే అంశాన్ని చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.42,472 కోట్ల రుణం తీసుకునేందుకు మాత్రమే కేంద్రం అనుమతించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాలానికి రూ.55 వేల కోట్లను రుణంగా తీసుకుంది. కేంద్ర ఆర్థికశాఖతోపాటు కాగ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలతో ప్రస్తుతం ఏపీ రుణాల మొత్తం రూ. 4,39,394 కోట్లకు పెరిగింది. మరోవైపు వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రూ. 1,17,503 కోట్ల రుణాలకు కూడా రాష్ట్రప్రభుత్వం హామీదారుగా ఉంది. ఈ అంశాలను ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రికీ సీఎం వివరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

వీటిపై పూర్తి సమాచారం ఇవ్వాలంటూ.. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కార్యాలయం(CAG), ఆర్థికశాఖలు తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను కూడా కాగ్, పీఏజీ అధికారులు సమావేశమై వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తీసుకున్న రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాగ్​కు వివరాలు సమర్పించలేనట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నీ ప్రధానికి వివరించి రుణపరిమితి సీలింగ్​పై వెసులుబాటు ఇవ్వాల్సిందిగా జగన్ కోరే అవకాశం ఉంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి సంబంధించి కేంద్రం రీయింబర్స్​మెంట్ చేయాల్సిన రూ.2,800 కోట్లను కూడా త్వరితగతిన చెల్లించేలా చూడాలని సీఎం కోరనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల విషయంపై కూడా ప్రధాని మోదీ-ముఖ్యమంత్రి జగన్​ల మధ్య చర్చ జరగనున్నట్టు తెసుస్తోంది.

Delhi Tour: ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి గన్నవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు దిల్లీ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు 1-జన్‌పథ్‌ చేరుకుంటారు. దిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:

Last Updated : Jun 1, 2022, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details