Secretariat System In AP: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయం పరిధిలోనూ స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాదించిన ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు చొప్పున మొత్తం రూ.3 వేల కోట్లు కేటాయించామని, ఆ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ‘గడప గడపకు..’ కార్యక్రమంలో కలెక్టర్లు కూడా పాల్గొనాల్సిందేనని, విధిగా ప్రతి నెలలో, ప్రతి నియోజకవర్గంలో 6 సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. ఆ కార్యక్రమాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి మంగళవారం వీడియో సమావేశంలో సమీక్షించారు. వివిధ అంశాలపై అధికారులకు జగన్ ఇచ్చిన ఆదేశాలు, సూచనలు ఇవీ..!
ప్రతి మహిళ మొబైల్ ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలి. యాప్ పనితీరును 15 రోజులకోసారి పర్యవేక్షించాలి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మాదకద్రవ్యాల వినియోగం, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పెట్టాలి.
ఫిర్యాదు చేయడానికి ప్రతి కాలేజీ, యూనివర్సిటీల్లో ఒక ఎస్‌ఈబీ నంబర్‌ను ప్రదర్శించాలి.
ఉపాధి హామీ కూలీలకు సగటు వేతనం రూ.240 ఉండాలి:ఉపాధి హామీ పనుల్లో మంచి పురోగతి ఉంది. ప్రస్తుతం సగటున ఉపాధిహామీ వేతనం రూ.205 అందుతోంది. దాన్ని రూ.240కి పెంచాలి.
* సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లినిక్‌ల భవనాలు, ఆంగ్ల మాధ్యమం స్కూళ్లూ గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి. అక్టోబరు 31కి వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
* వచ్చే డిసెంబరు నాటికి 4,500 గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ చేరుతుంది. 3,966 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు మంజూరయ్యాయి. వాటి నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి.
నాడు-నేడు పనులు నాణ్యంగా ఉండాలి: రెండో విడత కింద 22,279 ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులు నాణ్యంగా ఉండాలి. అక్కడక్కడా మిగిలిపోయిన స్కూళ్లలోను ఈ నెలాఖరుకి పనులు ప్రారంభమవ్వాలి. ఆసుపత్రుల్లో జరుగుతున్న పనులపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కలెక్టర్లు ప్రతి వారం వాటి పురోగతికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని, సమస్యలుంటే పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి.