Ex-gratia to fire accident victims: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనపై.. సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు.. ముఖ్యమంత్రి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అసలేం జరిగింది: ఏలూరు జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. రసాయన పరిశ్రమలోని నాలుగో యూనిట్‌లో మంటలు చెలరేగి.. రియాక్టర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు బిహార్వాసులుగా గుర్తించారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ, నూజివీడు డీఎస్పీ.. ప్రమాదస్థలిని పరిశీలించారు. ప్రమదానికి గల కారణాలు,.. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను.. పరిశ్రమ ప్రతినిధులు పరామర్శిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించే అవకాశమున్నట్లు సమాచారం.