రాష్ట్రంలో భారీవర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోంశాఖ మంత్రి సుచరితతో కలిసి ఏరియల్ సర్వే (CM Jagan Aerial survey) నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయ పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు, తాగునీరు, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నౌకాదళ సిబ్బందిని సీఎం జగన్ కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌తో మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్‌ద్వారా బుగ్గవంక వాగు, చెయ్యేరు నది కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాలు, పాపాఘ్ని, పెన్నా నదుల ప్రభావిత ప్రాంతాలు, పింఛ ప్రాజెక్టును సీఎం ఏరియల్ సర్వే చేశారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత రేణిగుంట, తిరుపతి నగరం, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీనది ప్రాంతాల్లోనూ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు.
తిరుపతికి వరద నీరు రాకుండా ఆపండి: సీఎం జగన్
రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. తిరుపతి నగరానికి వరద నీరు రాకుండా ఆపాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నగరంలో వరదల ప్రస్తావన తెచ్చారు. పైభాగంలోని చెరువులకు వెళ్లాల్సిన నీరు దారి మళ్లించడం.. కాలువలు పూడ్చివేయడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా తిరుపతి నగరంపైకి వరద వస్తోందని వివరించారు. ప్రజలు పడుతున్న అవస్థలను.. సహాయ చర్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమయంలో పక్కనే ఉన్న ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, జిల్లా కలెక్టరు హరినారాయణన్‌తో సీఎం మాట్లాడారు. వెంటనే పరిస్థితిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు మరికొన్ని రోజులు తిరుపతిలోనే ఉండాలని ప్రద్యుమ్నకు సూచించారు. తిరుపతి నగరంలో వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వీధుల్లో, మురుగు కాల్వల్లో పూడిక తొలగించాలని ఆదేశించారు. తిరుపతి డ్రైనేజీ వ్యవస్థపై మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని, వరద నీరు తగ్గిన వెంటనే పంట నష్టంపై అంచానాలు రూపొందించాలని వెల్లడించారు. వరద బాధితులు సహాయ శిబిరాలకు రాకున్నా ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వారు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు. ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నారు.
పాతకాల్వ గ్రామస్థుల ఆందోళన