వినాయకచవితి సంబురాలతో ఊరూవాడ సందడిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే పూజలు మొదలు పెట్టారు. విస్తృత ప్రచారంతో చాలా ప్రాంతాల్లో మట్టి ప్రతిమలు దర్శనమిస్తున్నాయి. పర్యావరణంపై అవగాహన పెంచుకున్న ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు దూరంగా ఉన్నారు.
చైతన్యం కలిగిస్తూ... ప్రతిమలు పంచుతూ..
అనంతపురానికి చెందిన పర్యావరణ ప్రేమికులు మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలనీ ఉచితంగా మట్టి గణనాథులను పంపిణీ చేశారు. గతంలో ప్రజలు మట్టి వినాయకులపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు కానీ ఇప్పుడు ఊరూవాడ గరిష్ఠస్థాయిలో మట్టి వినాయకులనే ప్రతిష్ఠించారు. గుంటూరులో 30అడుగుల మట్టి వినాయకుడి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. విజయవాడలో ఎక్కడిక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మట్టి గణనాథులను పంపిణీ చేశారు.
మట్టితో ప్రకృతికి మేలు... విత్తనాలతో పుడమికి మేలు..
ఒంగోలులోని దిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు విత్తన గణనాథులు చేశారు. మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడితే... విత్తనాలు వేస్తే ప్రకృతికి ఓ రూపం ఇచ్చినట్లవుతుందని వీరి అభిప్రాయం. అనంతపురం జిల్లాలోని ఆకృతి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులూ ఇదే పద్దతి అనుసరించారు. అనంతపురం జిల్లా వంటి ప్రాంతంలో మొక్కలు మొలకెత్తి... వర్షాలు కురిసేందుకు సహకరిస్తాయని వీరంతా చెబుతున్నారు.