కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రభుత్వపరంగా ఏ కార్యక్రమం జరిగినా నియోజకవర్గంలో వైకాపా వర్గపోరుకు వేదికవుతోంది. తాజాగా మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే వంశీని వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో కొంతమందికే ఇళ్ల పట్టాలు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర గ్రామస్థులకు తమ గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. వంశీ వేదిక వద్దకు వెళ్లకుండానే వైకాపాలోని ఓ వర్గం అడ్డుకుంది.
ఈనెల 25న తొలుత విజయవాడ రూరల్ మండలం నున్నలో ఎమ్మెల్యే వంశీమోహన్ ఇళ్ల పంట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఆరోజు ఎటువంటి నిరసనలు పెద్దగా కనిపించకపోయినా.. ఆది నుంచి వైకాపాకు అండగా ఉన్న నేతల్లో నిరాశ కనిపించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి తనకు ఆహ్వానం పంపలేదని గన్నవరం యార్డు ఛైర్మన్ భూక్యా ఉమాదేవి.. ఎమ్మెల్యే వంశీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గొల్లనపల్లిలో చేపట్టిన కార్యక్రమంలో 'జై వంశీ.. జై యార్లగడ్డ' అని ఇరువర్గాలు పరస్పర నినాదాలతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.