ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్పుకోసం ప్రయత్నిస్తున్నా.. తెలుగువాడి గౌరవాన్ని పెంచుతానని మాటిస్తున్నా: సీజేఐ - జస్టిస్ ఎన్వీ రమణ అవార్డు

CJI NV Ramana: తెలుగువాడి గౌరవాన్ని మరింత పెంచుతానని మాట ఇస్తున్నానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సీజేఐకి.. విజయవాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపైనే ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని రోటరీ క్లబ్ అందజేసింది. ఈ సందర్భంగా ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య ప్రసంగాన్ని ఆరంభించిన సీజేఐ.. రోటరీ క్లబ్‌ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఈ అవార్డు.. తాను సాధించాల్సింది ఇంకా చాలా ఉందని గుర్తు చేసిందని భావిస్తున్నానని అన్నారు.

ఆ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది
ఆ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది

By

Published : Dec 25, 2021, 8:28 PM IST

Updated : Dec 26, 2021, 5:18 AM IST

CJI NV Ramana: తెలుగువాడి గౌరవాన్ని మరింత పెంచుతానని మాట ఇస్తున్నానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అవార్డు అందుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తాను సాధించాల్సింది చాలా ఉందని ఈ అవార్డు గుర్తు చేసినట్టుగా భావిస్తున్నాని అన్నారు. రోటరీ క్లబ్‌ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్న సీజేఐ.. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని కితాబిచ్చారు.

మార్పుకోసం ప్రయత్నిస్తున్నా.. తెలుగువాడి గౌరవాన్ని పెంచుతానని మాటిస్తున్నా: సీజేఐ

కోర్టులో భాష ప్రజలకు అర్థమవ్వాలి..
ఇటీవల రాజ్యాంగంపై చాలా చర్చ జరుగుతోందన్న సీజేఐ.. ఇది శుభపరిణామం అని అన్నారు. రాజ్యాంగంలోని హక్కులు, బాధ్యతలతోపాటు రూల్‌ ఆఫ్‌ లా గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందని అన్నారు. రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పనిసరిగా కోర్టులను ఆశ్రయించాలని ఎన్వీ రమణ సూచించారు. అయితే.. కోర్టులో అర్థంకాని భాష మాట్లాడితే ప్రజలు ఇష్టం చూపరని అన్నారు. న్యాయస్థానంలో జరిగే వాదనలు ప్రజలకు అర్థంకాకపోతే.. అవన్నీ వ్యర్థమేనని అన్నారు. అందువల్ల కోర్టుకు వచ్చే సామాన్యుడికి తన కేసు గురించి అర్థమయ్యేలా చూడాలని అభిలాషించారు.

న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాలి..
న్యాయవ్యవస్థ కొన్ని ప్రాథమిక సమస్యలను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే.. ఈ మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. దేశంలో 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సీజేఐ.. ఏళ్లతరబడి కేసులు పెండింగ్‌లో ఉండకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. 3 వ్యవస్థలూ సరిగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తేల్చి చెప్పారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా.. వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. జడ్జిల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

‘న్యాయం చేయడం అనేది కోర్టుల పనే కాదు.. ప్రభుత్వ బాధ్యత కూడా. రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని అధికరణల ప్రకారం న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, కార్య నిర్వాహక వర్గంపై ఉంది. ప్రభుత్వం, కార్య నిర్వాహక వ్యవస్థలు చట్టానికి లోబడి పనిచేస్తే.. ఎవరూ న్యాయస్థానాలకు రావాల్సిన పనిలేదు. ఈ రెండూ పరిధులు దాటినప్పుడు.. న్యాయస్థానాలు తప్పకుండా జోక్యం చేసుకుంటాయి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని మూడు విభాగాలు ధర్మబద్ధంగా పని చేస్తే వాటిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పౌర హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి’ సీజేఐ అని సూచించారు.

..

సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా

న్యాయ వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు సుదీర్ఘ కాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదని సీజేఐ చెప్పారు. ‘నాకు ముందున్న సీజేఐలు వీటిని ప్రస్తావించారు. ఇప్పుడు నేను చెబుతున్నా. నా తర్వాత వచ్చినవారూ ప్రస్తావిస్తారు. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యాన్ని క్రమంగా మర్చిపోతున్నారు. పోలీసులు కేసు పెట్టినప్పుడో, న్యాయపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడే అందరికీ గుర్తుకువస్తోంది. మిగిలిన సమయాల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరూ న్యాయస్థానాలకు రావాలని కోరుకోను. కాకపోతే తమ హక్కులకు భంగం కలిగినప్పుడు తప్పకుండా కోర్టు తలుపు తట్టాల్సిందే. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థను భారతీయీకరణ చేయాలి. దేశంలోని సామాన్యుల నుంచి పెద్దవారి వరకు.. న్యాయ ప్రక్రియ, కోర్టులు, చట్టాలు అంటే అర్ధం కాని బ్రహ్మ పదార్థంలా చూస్తున్నారు. సరళీకరణ జరిగితేనే న్యాయవ్యవస్థ అందరికీ చేరువవుతుంది. తన కేసు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో కక్షిదారులకు తెలియాలి. తీర్పు ఏం చెబుతున్నారో అర్థం కావాలి. అప్పుడే న్యాయస్థానాల పట్ల గౌరవం పెరుగుతుంది. దేశవ్యాప్తంగా న్యాయ విభాగంలో కనీస సదుపాయాలు పెరగాలి. ప్రస్తుతం దేశంలోని వివిధ కోర్టుల్లో 4.60 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అన్ని కేసులు ఉండటం పెద్ద సంఖ్యేమీ కాదు. అయితే చిన్న కేసులను కూడా ఏళ్ల తరబడి సాగదీయకుండా సత్వరమే తీర్పులివ్వాల్సిన బాధ్యత న్యాయస్థానాలు, జడ్జిలపై ఉంది. ఇందులో ప్రభుత్వానికీ బాధ్యత ఉంది. న్యాయ వ్యవస్థలో సమస్యలను పరిష్కరించి అందరికీ న్యాయం అందించాలని ప్రయత్నిస్తున్నా. ఇందులో భాగంగా జడ్జిల ఖాళీలను భర్తీ చేయడం, కొత్త కోర్టుల ఏర్పాటు, చట్టాల సవరణలకు శాయశక్తులా కృషి చేస్తున్నా’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు.

ఈ పురస్కారం బాధ్యతను పెంచింది

‘ఈ పురస్కారం నాకు మరింత బాధ్యతను పెంచింది. సాధించాల్సింది చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తోంది. మీ ఆశలకు అనుగుణంగా పనిచేసి, న్యాయ కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేస్తా’ అని సీజేఐ హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రాజ్యాంగంపై విపరీతమైన చర్చలు జరుగుతున్నాయని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. ‘ప్రజలు తమ హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకుంటున్నారు. ప్రజల్లో చైతన్యం రావాలంటే.. వారికి హక్కుల గురించి తెలియ జేయాలి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థకు నేను గౌరవాధ్యక్షుణ్ని. మేం అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. నాణ్యమైన, నమ్మకమైన న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తున్నాం. రూల్‌ ఆఫ్‌ లా (చట్టబద్ధమైన పాలన) చాలా ముఖ్యం. ఇది లేకపోతే ఏ దేశంలోనైనా అరాచకం ప్రబలుతుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మేధావి వర్గంవైపు చూస్తుంటారు. వారు ప్రజలకు ఇతోధికంగా తోడ్పాటు అందించినప్పుడే దేశానికి, రాజ్యాంగానికి మేలు చేసిన వారవుతారు’ అని సీజేఐ చెప్పారు.

బెజవాడ, కృష్ణా నీళ్లే నా బలం

‘విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. అనేక రాజకీయ సిద్ధాంతాలకు పుట్టినిల్లు. నేను ఇక్కడే న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టి, తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చాను. బెజవాడ వీడి వెళ్లాలంటే చాలా బాధేసింది. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇక్కడికి వచ్చి సోమవారం ఉదయానికి తిరిగి హైదరాబాద్‌ వెళ్లేవాణ్ని. నాకు ఈ నగరంతో ఎన్నో ఆనందకరమైన అనుభూతులు ఉన్నాయి. ఇక్కడివారు ఎంతోమంది న్యాయవాదులు, అధ్యాపకులు, వైద్యులు, పాత్రికేయులు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించారు. కానీ.. గతంలో నేను చూసినంత గొప్పగా ఇప్పుడు విజయవాడ లేదన్నది వాస్తవం. మళ్లీ ఒకసారి జూలు విదిల్చి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి చేరడానికి, దృఢంగా తయారవడానికి బెజవాడ, కృష్ణా నీళ్లు నాకెంతో దోహదపడ్డాయి’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

తెలుగును మరవద్దు..

‘తెలుగు భాష ఎంతో ఉత్కృష్టమైనది. మాతృభాషను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆంగ్లం కానీ మరే భాష అయినా నేర్చుకోండి ఫర్వాలేదు. కానీ అమ్మ భాషపై మనకు సరైన పునాది లేకపోతే.. మన ఆలోచనల్లో పరిపక్వత రాదు. తెలుగులోనే మాట్లాడండి. పుస్తకాలు చదవండి. తెలుగులో ఉత్తరాలు రాయడం అలవాటు చేసుకోండి. తెలుగు భాష ఔన్నత్యాన్ని, సంస్కృతి, సాహిత్యం గురించి ప్రపంచానికి తెలియజేయండి. ఇదే నేను మీ అందరికీ ఇచ్చే సందేశం’ అని సీజేఐ చెప్పారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఆయన సతీమణి శివమాలను విజయవాడ రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీజేఐకి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. పురస్కారం కింద ఆయనకు ఇవ్వాల్సిన రూ.25 వేల నగదును.. ఎస్‌కేసీవీ చిల్డ్రన్‌ హోం, నవజీవన్‌ బాలభవన్‌లకు చెరి సగం అందజేశారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేరున ఇద్దరు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయనున్నట్లు ఆంధ్ర హాస్పిటల్‌ ప్రకటించింది. సిద్ధార్థ అకాడమీ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు పురస్కారాన్ని అందజేసింది. అనంతరం ఐఎంఏ, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, వాసవ్య మహిళా మండలి, సర్వోదయ ట్రస్టు, రెడ్‌క్రాస్‌ సొసైటీ, క్రెడాయ్‌, తదితర సంస్థల ప్రతినిధులు సీజేఐ దంపతులను సత్కరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత కుమార్‌ మిశ్ర, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్ర శర్మ హాజరయ్యారు.

భారీగా తరలివచ్చిన ప్రముఖులు

ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అచ్చెన్నాయుడు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్నవరపు రామస్వామి, రహదారులు భవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కర్ణాటక అర్బన్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ హెప్సిబా రాణి, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతికుమార్‌, పర్యావరణవేత్త అజయ్‌ కాట్రగడ్డ తదితరులు సీజేఐని కలిసిన వారిలో ఉన్నారు.

వేదికపై నుంచి దిగి వచ్చిన సీజేఐ
గుంటూరుకు చెందిన న్యాయవాది పరంధామయ్య సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణను కలవడానికి వచ్చారు. ఆయన వయోభారంతో వేదికపైకి ఎక్కడానికి ఇబ్బంది పడుతుండటాన్ని జస్టిస్‌ రమణ చూశారు. పైకి రావొద్దని వారించి.. వెంటనే తానే కిందకు దిగి వచ్చి కలిశారు. పరంధామయ్యను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

మార్పుకోసం ప్రయత్నిస్తున్నా.. తెలుగువాడి గౌరవాన్ని పెంచుతానని మాటిస్తున్నా

"రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందాలి. ఆ హక్కులు లైబ్రరీలు, సభలకు పరిమితం కాకూడదు. హక్కులపై అట్టడుగు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. రూల్ ఆఫ్ లా లేకుంటే అరాచకం పెరుగుతుంది. అరాచకం పెరిగితే ప్రజాస్వామ్యానికి ముప్పు. కోర్టు అంశాలు అర్థంకాని బ్రహ్మపదార్థంలా మిగిలిపోకూడదు. కోర్టుకు వచ్చే సామాన్యుడికి తన కేసు గురించి అర్థం కావాలి. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థలో మౌలిక వసతులు పెరగాలి. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన బాధ్యత ప్రభుత్వాలదే. న్యాయవ్యవస్థ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. న్యాయవ్యవస్థ భారతీయీకరణ జరగాలి. దేశంలో 4.6 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 3 వ్యవస్థలూ సరిగా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. సీజేఐగా వ్యవస్థలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నా. జడ్జిల భర్తీ, ఇతర సంస్కరణలు తెచ్చేందుకు కృషి చేస్తున్నా. మన ఎదుగుదలకు, పునాదికి మాతృభాషే కీలకం. ఎన్ని భాషలు వచ్చినా ఆలోచనాత్మక ధోరణి మాతృభాషతోనే సాధ్యం. తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి." - జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ

ఇదీ చదవండి :

సీజేఐ ఎన్వీ రమణకు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు

Last Updated : Dec 26, 2021, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details