CJI JUSTICE NV RAMANA : న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకుంటున్నారని వ్యాఖ్యానించడం ఇటీవల కాలంలో రివాజుగా మారిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఇది ఒక పెద్ద అపోహని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో కేంద్ర న్యాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియంలు, ఐబీ, అత్యున్నత స్థాయి కార్య నిర్వాహక వ్యవస్థ కలిసి ఓ అభ్యర్థి యోగ్యతలను పరిశీలిస్తాయని తెలిపారు. దీని గురించి బాగా తెలిసినవారూ దుష్ప్రచారం చేయడం తనను బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు కొన్ని శక్తులకు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన లావు వెంకటేశ్వర్లు 5వ స్మారక ఉపన్యాస సభకు జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ - భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు.
భవిష్యత్తు సవాళ్లు
ప్రస్తుతం న్యాయ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు. ‘శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో రోజురోజుకూ కొత్త సమస్యలు, కొత్త తరహా కేసులు వస్తున్నాయి. అంతర్జాలం, డార్క్‌వెబ్‌లో అక్రమ వస్తువుల అమ్మకం, ఆన్‌లైన్‌లో మోసాలు, హ్యాకింగ్, విద్వేష ప్రసంగాల వ్యాప్తి వంటివి మన ముందున్న సరికొత్త సవాళ్లు. మనీ లాండరింగ్, డిజిటల్ కరెన్సీ ద్వారా నేరాలకు డబ్బు సమకూర్చడం వంటివి బాగా పెరిగాయి. వీటిని అర్థం చేసుకోవడం న్యాయమూర్తులు, దర్యాప్తు అధికారులకు కష్టతరంగా మారుతోంది. న్యాయమూర్తులు, న్యాయవాదులకు వీటన్నింటిపై అవగాహన ఉండాలంటే.. సాంకేతిక పరిజ్ఞానం గురించి విస్తృతంగా తెలుసుకోవాలి. ట్రాయ్, సెక్యూరిటీస్ ట్రైబ్యునల్, కాంపిటీషన్ కమిషన్, విద్యుత్తు నియంత్రణ కమిషన్ వంటివి ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు మారాలి. ట్రైబ్యునళ్లలో సాంకేతికతపై అవగాహన ఉన్నవారిని సభ్యులుగా నియమించాల్సిన అవసరాన్ని ఇది చాటిచెబుతోంది. పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులకు సంబంధించిన పిటిషన్ల కంటే వీటికి ఎంతో ప్రాధాన్యమివ్వాలి. చట్టాలు చేసే ముందు దాని ప్రభావం, రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా లేదా అన్నదానిపై సరైన మదింపు జరగడం లేదు. చట్టం ముసాయిదా తయారీకి ముందే ఇవన్నీ ఒకటికి, రెండుసార్లు సరిచూసుకోవడం శాసన వ్యవస్థ కనీస బాధ్యతగా భావించాలి. చట్టం ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం వాటి రూపకల్పన సమయంలోనే ఆలోచించాలి. చట్టాలు చేసేటప్పుడు ముందుచూపు కొరవడితే కోర్టుల్లో కేసులు పెరుగుతాయి. దీనికి మంచి ఉదాహరణ బిహార్ ప్రొహిబిషన్ చట్టం. 2016లో ఇది అమల్లోకి వచ్చాక హైకోర్టులో బెయిల్ పిటిషన్లు భారీగా పెరిగిపోయాయి. దీనివల్ల సాధారణ బెయిల్ దరఖాస్తు పరిష్కారానికీ ఏడాది పట్టింది’ అని చెప్పారు.
ప్రభుత్వం తనకు మెజారిటీ ఉందని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోరాదు. ప్రతి నిర్ణయం రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను సమాన హోదాలతో సృష్టించింది. మిగిలిన రెండు వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు అప్పగించింది. ఆ అధికారం కోర్టులకు లేకుంటే.. దేశంలో ప్రజాస్వామ్యం పనితీరు ఊహించడమే కష్టమయ్యేది.- జస్టిస్ ఎన్.వి.రమణ
జడ్జిలపై విషప్రచారం తగదు
న్యాయమూర్తులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయని, న్యాయాధికారులపై భౌతిక దాడులు నమోదవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ‘సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వీటిని పలుసార్లు ప్రస్తావించాను. కక్షిదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడకపోతే జడ్జిలపై ఓ ప్రణాళిక ప్రకారం ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారం చేస్తున్నారు. వీటిని దర్యాప్తు సంస్థలు సమర్థంగా ఎదుర్కోవాలి. ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకుని, ఆదేశించే వరకు అధికారులు దర్యాప్తునకు పూనుకోకపోవడం దురదృష్టం. ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయమూర్తులు, న్యాయాధికారులు నిర్భయంగా విధులు నిర్వహించేలా తోడ్పాటు అందించాలి. కేసుల పరిష్కారం విషయంలో మీడియా ట్రయల్స్ ప్రామాణికం కాజాలవు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు తీర్చాలంటే భారీగా నిధులు అవసరం ఉంది. జాతీయ, రాష్ట్ర న్యాయ మౌలిక వసతుల ప్రాధికార సంస్థలు ఎప్పుడో ఏర్పడాల్సింది. సాధ్యమైనంత త్వరగా వీటిని సాకారం చేసేలా ప్రభుత్వంతో మాట్లాడుతూనే ఉన్నా’ అని వివరించారు.
ఖాళీల భర్తీకి చర్యలు