రేషన్ దుకాణాల సమస్యలపై 1902కు ఫోన్ చేసి చెప్పవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు పోర్టబిలిటి కింద రేషన్ తీసుకోవచ్చన్నారు. యాప్ ద్వారా ధాన్యం కొనుగోలు, మద్దతు ధరపై నిత్యం సమీక్ష జరుగుతోందని కోన శశిధర్ వివరించారు.
'ఇప్పటికే తొలివిడత రేషన్, కందిపప్పు లబ్ధిదారులకు అందించాం. ఈనెల 16 నుంచి రెండోవిడత పంపిణీ ఉంటుంది. లబ్ధిదారులకు ముందుగానే కూపన్లు ఇచ్చి రేషన్ అందిస్తాం. కార్డుదారులు ఆందోళన చెందవద్దు, సరిపడా సరకులు ఉన్నాయి. రబీ పంట కోసం 993 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ సచివాలయంలో రైతుల నమోదు ప్రక్రియ ఉంటుంది. పక్క రాష్ట్రాల పంటలు ఇక్కడకు రాకుండా చూస్తున్నాం. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా ఉంచుతున్నాం. ఈ-క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తాం. మద్దతుధర కంటే తక్కువకు పంటను అమ్ముకోవద్దు.' అని కోన శశిధర్ వివరించారు.