కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. చట్టాలను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లాలో...
కేంద్రం అప్రజాస్వామికంగా తెచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లును వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్లు కూడలిలో నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందన్నారు. ఈ కోడ్లను తాము ఆమోదించడం లేదని కార్మిక సంఘాలు చెప్పినా కేంద్రం ఖాతరు చేయలేదన్నారు. చివరికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులనూ తిరస్కరించిందని విమర్శించారు.
కృష్ణా జిల్లాలో...
కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణలు 2020 బిల్లులను వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేశు డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేవలం కార్పొరేట్లు, ధనిక వర్గాలే లబ్ధి చేకూర్చేలా ఉందని.. పేద ,మధ్య తరగతి ప్రజల ఊసే లేదని విమర్శించారు.
అనంతపురం జిల్లాలో...
దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడు అమీర్ భాషా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అనంతపురంలో ఏఐటీయూసీ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద చట్టాల పత్రాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని.. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక, రైతు వ్యతిరేక చట్టాల పత్రాలను దహనం చేశారు. మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని.. దేశ సంపదను అంబానీ ,అదానీలకు దోచి పెడుతోందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేశ్ విమర్శించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సిందిపోయి నూతన చట్టాలతో వేధిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కాకులను కొట్టి.. గద్దలకు వేసే చందంగా ఉంది అని రమేశ్ అన్నారు.