ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెదేపా మహిళా నేత గౌతు శిరీషకు మరోసారి సీఐడీ నోటీసులు - గౌతు శిరీషకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ

CID Notices: తెదేపా మహిళా నేత గౌతు శిరీషకు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

గౌతు శిరీషకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ
గౌతు శిరీషకు మరోసారి సీఐడీ నోటీసులు జారీ

By

Published : Jun 10, 2022, 9:35 PM IST

Gouthu Sireesha: తెలుగుదేశం నేత గౌతు శిరీషకు సీఐడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీచేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ చట్టం కింద నమోదు చేసిన కేసులో దర్యాప్తు కోసం హాజరుకావాలని తాఖీదులిచ్చారు.

కాగా ఇప్పటికే గౌతు శిరీష.. మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నేరం అంగీకరిచాలంటూ సంతకాలు పెట్టమని సీఐడీ అధికారులు ఒత్తిడి చేయగా తాను తిరస్కరించినట్లు శిరీష తెలిపారు. "ఓ కాగితంపై వారికి నచ్చినట్లు రాసుకొచ్చి దానిపై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేశారు. అందులో రాసిన అంశాలను నేను అంగీకరించడం లేదని సంతకం చేస్తానని చెప్పగా.. అలా అయితే ఇక్కడి నుంచి బయటికి పంపించేదే లేదంటూ హెచ్చరించారు. అసలు ఏ కేసులో నాకు నోటీసులిచ్చారో దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ అడిగినా పట్టించుకోలేదు. 7 గంటల పాటు కనీసం మంచినీళ్లు, ఆహారమైనా ఇవ్వకుండా బంధించి విచారించారు" అని ఆమె పేర్కొన్నారు.

అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను నిలిపేస్తున్నారని పేర్కొని ఉన్న నకిలీ ప్రెస్‌నోట్‌ను సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారంటూ గత నెల 29న సీఐడీ పలువురిపై కేసు నమోదుచేసింది. అందులో భాగంగా గౌతు శిరీషను కూడా నిందితురాలిగా పేర్కొని విచారణకు పిలిపించింది. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 6న ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 6 గంటలకు బయటకు వచ్చారు. అనంతరం విచారణ జరిగిన తీరును ఆమె వివరించారు.

"నా సామాజిక మాధ్యమ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు అడిగారు. అవి గుర్తులేవనడంతో కొత్త పాస్‌వర్డ్‌లు సృష్టించి నాతోనే వాటిని ఓపెన్‌ చేయించారు. మా న్యాయవాదిని, నన్ను వేర్వేరు గదుల్లో ఉంచారు. ఫోన్‌లు అందుబాటులో లేకుండా చేశారు. ఉగ్రవాదులతో వ్యవహరించినట్లు ప్రవర్తించారు. ‘పోస్టును షేర్‌ చేయాలంటూ అందరితోనూ మీరే చెప్పారట కదా! మీతో ఆ పోస్టు ఎవరు పెట్టించారో చెప్పండి’ అని ప్రశ్నించడంతో నేను అలాంటి పోస్టులేవి పెట్టలేదన్నాను. ఫేస్‌బుక్‌లో నా ఫ్రెండ్స్‌ లిస్ట్‌లో ఉన్న వారు ఎవరో చెప్పాలని అడగగా... చెప్పాల్సిన అవసరం లేదన్నాను. అరగంటకు ఒకసారి బయటకు వెళ్లిన అధికారులు వారి ఉన్నతాధికారులు చెప్పింది విని మళ్లీ నన్ను విచారించారు. అక్రమ కేసులో నన్ను ఇరికించాలని ప్రయత్నించారు. నా చుట్టూ 30-40 మంది పోలీసుల్ని పెట్టి వరండాలోకి కూడా అడుగుపెట్టనీయకుండా చేశారు" అని శిరీష వివరించారు.

ఇవీ చూడండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details