CID arrests another in Siemens case: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టులో రూ.241 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీఐడీ అధికారులు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. ఎల్లైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఏషియా) లిమిటెడ్ సంస్థకీ అడ్మినిస్ట్రేటర్ శిరీష్ చంద్రకాంత్ షా (ఏ13)ను ముంబైలో అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు విజయవాడకు తీసుకొచ్చి, ఏసీబీ ప్రత్యేకకోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఈ నెల 24 వరకూ జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం అయిదుగురు అరెస్టయ్యారు.
ఆ ఫిర్యాదుల ఆధారంగా సీఐడీ కేసు నమోదు..
CID Filed Case On Siemens: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు ఓఎస్డీ నిమ్మగడ్డ వెంకట ప్రసాద్‌తో పాటు పుణెకు చెందిన డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబయికి చెందిన స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్ తదితర 26 మందిని నిందితులుగా పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 166, 167, 418, 420, 465, 468, 471, 409, 201, 109 రెడ్‌విత్ 120బీ సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1)(సీ) (డీ) సెక్షన్ల ప్రకారం ఈ కేసు పెట్టింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కె.అజయ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.