ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 30, 2021, 10:26 PM IST

ETV Bharat / city

ఓటమి భయంతోనే బ్లాక్​ మెయిలింగ్ రాజకీయాలు: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైకాపా నేతలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన..ఎన్నికలను సవాల్​గా తీసుకోవాలని సూచించారు.

ఓటమి భయంతోనే వైకాపా బ్లాక్​మెయిలింగ్ రాజకీయాలు
ఓటమి భయంతోనే వైకాపా బ్లాక్​మెయిలింగ్ రాజకీయాలు

పంచాయతీ ఎన్నికలను ఒక సవాల్​గా తీసుకోవాలని శ్రేణులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తొలిదశ పంచాయతీ ఎన్నికల ప్రాంతాల నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. అన్ని పంచాయతీల్లో నామినేషన్లు వేయాలని సూచించారు. ధనబలం, కండబలం, అధికారబలంతో వేధింపులు, బెదిరింపులకు వైకాపా నాయకులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బలవంతపు ఏకగ్రీవాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పెద్దఎత్తున మద్యం ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. మద్యం సీసాలతో తప్పుడు కేసులు పెట్టించే అవకాశం ఉందని.. అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

ప్రలోభాలకు గురిచేసి, వేలం పాటలు పెట్టి ఎన్నికలు జరగకుండా పన్నాగాలు పన్నుతున్నారని విమర్శించారు. కొందరు పోలీసులతో కుమ్మక్కై.. బలవంతపు ఏకగ్రీవాలు జరిపించాలని చూస్తున్నారన్నారు. బైండోవర్ కేసులు కేవలం తెదేపా వాళ్లపైనే పెట్టి వైకాపా వాళ్లను స్వేచ్ఛగా వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎటువంటి కేసులు లేనివాళ్లను కూడా స్టేషన్​కు పిలిపించి బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కొత్తగా తెచ్చిన నల్లచట్టం ముసుగులో తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. ఓటమి భయంతోనే వైకాపా వాళ్లు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలను సహించేది లేదని హెచ్చరించారు. మద్యం విక్రయాలను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details