అచ్చెన్నాయుడి ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు ప్రభుత్వం చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అరెస్టు చేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగిందన్న విషయం చెప్పినా...అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారని మండిపడ్డారు. దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చిందన్నారు. అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని అనిశా కోర్టు చెప్పిందని, నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించిందన్నారు. 10 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. అనిశా అధికారుల అర్థరాత్రి కుట్రలేంటని మండిపడ్డారు.
'అచ్చెన్న ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు ప్రభుత్వం కుట్రలు' - అచ్చెన్నాయుడి అర్థరాత్రి డిశ్ఛార్జ్
ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అచ్చెన్నాయుడిని అర్థరాత్రి డిశ్ఛార్జ్ చేయటంపై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారన్న చంద్రబాబు..,ఇది కేసు విచారణలా లేదని, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయన్నారు. ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైకాపా ల్యాండ్ మాఫియా, 108 అంబులెన్స్ స్కామ్, ఆవ భూముల స్కామ్, ఇసుక మాఫియాపై ఎందుకులేదని ప్రశ్నించారు. కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయని గుర్తుచేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. దీనిపై న్యాయపరంగా తామూ పోరాడతామని వైకాపా కుట్రలను అడ్డుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు: రఘురామకృష్ణరాజు