విజయవాడ నగరంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్‌ను జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, చిరంజీవి యువత అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని చిరంజీవి చేస్తున్నారని పోతిన మహేష్ అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రజలకోసం గతంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లను స్థాపించిన చిరంజీవి.. ప్రస్తుతం కరోనా బాధితుల కోసం సొంత నిధులతో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని అన్నారు. రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలు కాపాడటంలో ముందు ఉంటామని చిరంజీవి మరోసారి నిరూపించారన్నారు. శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పేందుకు చర్యలు చేపట్టినట్లు పోతిని మహేష్ పేర్కొన్నారు. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభంవైపు అడుగులు వెయ్యడం శుభ పరిణామమని డాక్టర్ సమరం హర్షం వ్యక్తం చేశారు.