‘‘సమతాస్ఫూర్తి కేంద్రం అంటే ఇప్పుడు చూస్తున్నదే అంతిమం కాదు.. ఈ ప్రాజెక్టుకు ఏటా అదనపు హంగులు, విశేషాలు జత కలుస్తూనే ఉంటాయి’’ అని చినజీయర్‌స్వామి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ వద్ద ముచ్చింతల్ కేంద్రంగానే విగ్రహం ఏర్పాటు చేయాలనే నియమం పెట్టుకుని ప్రాజెక్టు చేపట్టలేదని.. పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ‘‘ఇలాంటి ప్రాజెక్టును కొండ ప్రాంతంపై చేపట్టాలనే ఆలోచనతో చాలా ప్రదేశాలు వెతికాం. తమిళనాడులో రామానుజాచార్యులు అవతరించారు కనుక అక్కడే ఏర్పాటు చేద్దామని తొలుత భావించాం. రెండేళ్లు గడిచినా ఆ రాష్ట్రం నుంచి స్పందన రాలేదు. తర్వాత ఎన్నో చర్చలు చేశాం. ముచ్చింతల్ వద్ద మైహోమ్స్ రామేశ్వర్‌రావు భూమిని విరాళంగా అందించడంతో ఇక్కడే ఏర్పాటుకు సంకల్పించాం’’ అని వివరించారు. 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ ఉత్సవాలు వచ్చే నెల 2న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ‘ఈనాడు’కు చినజీయర్‌స్వామి ప్రత్యేక ముఖాముఖి ఇచ్చారు. ఆ వివరాలు..
- రోజురోజుకూ అసమానతలు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించేందుకు సమతాస్ఫూర్తి కేంద్రం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలుంటాయి..?
వాటిని తగ్గించడానికి సమాజం నుంచే ప్రేరణ రావాలి. మేం చేస్తున్న కార్యక్రమాలన్నీ సామాజిక ప్రేరణకు ఊతమిచ్చేవే. పాలకుల్లోనూ అసమానతలు ఉండకూడదనే ఆలోచన ఉంది. కానీ ఆచరణలోకి రావడంలేదు. దానికి బలాన్ని కలిగించే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. - సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమేమిటి..?
రామానుజాచార్యులు అవతరించి 2017కు వెయ్యేళ్లు పూర్తయ్యింది. సమాజంలో ప్రతిఒక్కరూ వాస్తవిక జీవితం గడపాలనే సందేశాన్నిచ్చారు. ఆనాటి సమాజంలో అసమానతలు ఎక్కువగా ఉండటం చూసి.. ఆ వివక్ష సరికాదని చాటిచెప్పారు. దళితులు, మహిళలకు మంత్రోపదేశం, ఆలయాల్లో ప్రవేశం వంటి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రస్తుత సమాజానికి మరోసారి ఆ తరహా సంస్కరణలు అవసరం. ఆయన ఆలోచన ధోరణిని అందించాలనే ఉద్దేశంతోనే సమతాస్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేశాం.
- భవిష్యత్తులో కేంద్రం తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు..?
ఇక్కడ 108 దివ్యక్షేత్రాలను వైదిక విధానంలో ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతిష్ఠిస్తున్నాం. ఆయా ఆలయాల్లో ఏటా అన్ని రకాల ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుతం రామానుజాచార్యుల జీవిత విశేషాలను కొన్నింటినే చూపించగలుగుతున్నాం. భవిష్యత్తులో ఏటా మరిన్ని జోడించనున్నాం. ప్రాజెక్టుకు అదనపు హంగులద్దుతాం. - మున్ముందు ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టే ఆలోచన ఉందా..?
సమాజహితమైన కార్యక్రమాలెన్నో రామానుజాచార్యులు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు ప్రభుత్వాలు పూనుకుంటేనే సాధ్యమవుతాయి. మాలాంటి వాళ్లకు ఆర్థిక వనరులకూ ఇబ్బంది. ఎవరైనా స్థలం, నిధులు విరాళంగా ఇస్తే ఈ తరహా ప్రాజెక్టులు చేయవచ్చు.
- సమతాస్ఫూర్తి కేంద్రం నిర్వహణ ఎలా ఉండబోతోంది..? టికెటింగ్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన ఉందా..?
ఫిబ్రవరి 2 నుంచి జరిగే సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు అందరికీ ఆహ్వానమే. తర్వాత కేంద్రం సందర్శనకు ఓ నియమం ఏర్పాటు చేసుకోవాలి. 108 ఆలయాలలో 250 మందికి తక్కువ కాకుండా వైదిక వర్గం పనిచేస్తుంది. అదనపు సిబ్బంది అవసరం. ప్రసాదాల వితరణ జరగాలి. ఇలా అన్నింటి నిర్వహణకు ఓ వ్యవస్థ కావాలి. ఇందుకు అవసరమైన ఆర్థిక వనరులు వాటంతటవే చేకూరేలా ఏం చేయాలన్నది త్వరలో నిర్ణయిస్తాం. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి లేదా రెండు రోజులు ఉంటారు. అందుకు తగ్గ వసతులు సమకూరాలి. ప్రభుత్వం పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలి. - ప్రాజెక్టు విశేషాలేమిటి? ఆధునిక సాంకేతికతను వినియోగించి ఏయే కార్యక్రమాలు చేపట్టనున్నారు..?
కేంద్రంలో ఉండే ఆలయాల ప్రత్యేకతలను నాలుగు భాషల్లో వినిపించేలా సెల్ఫ్ గైడింగ్ టూల్ అందుబాటులోకి రానుంది. తొలిసారిగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) సాంకేతికతను వినియోగించాం. ప్రాజెక్టు విశేషాలపై పది నిమిషాలపాటు ప్రజంటేషన్ ఉంటుంది. మున్ముందు కృత్రిమమేధ, వర్చువల్ రియాలిటీ వంటి వాటిని ఉపయోగించి రామానుజాచార్యులు సమాజోద్ధరణకు చేసిన కార్యాలను సందర్శకులకు చూపించాలనే ప్రాజెక్టును చేపట్టనున్నాం. 200 అడుగుల వెడల్పు ఉండే తెరపై రామానుజాచార్యుల జీవిత విశేషాలు, ప్రాజెక్టు విశేషాలు ప్రదర్శిస్తాం.