బాలికల విద్యను ప్రోత్సహించాలనే ఉన్నత లక్ష్యంతో విజయవాడలో 67 ఏళ్ల క్రితం స్థాపించిన మాంటిస్సోరీ ఉన్నత పాఠశాల(childrens montessori high school closed) మూతపడింది. ఎయిడెడ్ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేయాలని(ap withdraw the grants in aided schools) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. ఈ ప్రఖ్యాత విద్యాసంస్థ ప్రయాణం అర్థంతరంగా ఆగిపోయింది. ఇక్కడ పనిచేస్తున్న 13 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం తీసుకున్నందున పాఠశాలను పూర్తిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. టీసీలు తీసుకొని వెంటనే సమీపంలోని పాఠశాలలో చేరాలని విద్యార్థులకు సూచించింది.
మహిళా అక్షరాస్యత ప్రోత్సహించేందుకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోటేశ్వరమ్మ, కృష్ణా రావు దంపతులు 1954లో మాంటిస్సోరి విద్యా సంస్థ(childrens montessori high school close)ను ప్రారంభించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రాంటు ఇస్తుండటంతో తక్కువ ఫీజులతోనే వాటిని నిర్వహించారు. ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు ఇక్కడ చవుకొని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ప్రస్తుతం 8, 9 ,10 తరగతులు చదువుతున్న 450 మంది వరకు విద్యార్థులంతా వేరే పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో మూతపడుతున్న మొదటి ఎయిడెడ్ పాఠశాల ఇదే కావటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 1,972 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా.. వీటిలో 1,97,291 మంది విద్యార్థులు ఎయిడెడ్ పాఠశాల(aided schools)ల్లో చదువుతున్నారు.