ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సెలవులు: ప్రత్యేకతకు పదును పెడుతున్న చిన్నారులు - lockdown in ap

క్షణం కూడా కుదురుగా కూర్చోరు. పాఠశాలలకు సెలవు అంటే ఆటలకు అడ్డే ఉండదు. ఇళ్లు దాటొద్దంటే... ఏడ్చి గీపెట్టి మరీ పరుగులు తీసే పిల్లలకు ఈ లాక్‌డౌన్‌ నిజంగా కఠిన పరీక్షే. ఇంటి నుంచి బయటకు వెళ్లలేరు... తోటి పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్తామన్నా... తల్లిదండ్రులు ధైర్యంగా పంపడంలేదు. టీవీలు, చరవాణిలకు చాలా మంది పిల్లలు బందీ అయిపోతుంటే... మరికొందరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమలోని ప్రత్యేకతకు పదును పెడుతున్నారు.

children time spending lockdown period for knowledge improve
తమలోని ప్రత్యేకతకు పదును పెడుతున్నారు

By

Published : Apr 8, 2020, 3:39 PM IST

తమలోని ప్రత్యేకతకు పదును పెడుతున్నారు

పిల్లలు ఎదైనా సాధించాలనుకుంటే వారి దూకుడును ఆపడం ఎవరి తరం కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకోవాలన్నా... కథలు వినాలన్నా... ఆటలు ఆడాలన్నా... తాతల నుంచి తల్లిదండ్రుల వరకు అందరి వద్ద చెవిలో జోరిగలా... అనుకున్న పని పూర్తి చేసేంత వరకు విశ్రమించరు. కరోనా వైరస్‌ కారణంగా ప్రతికూల వాతావరణంలో తమ పిల్లలను ఇంటి గడప దాటించేందుకు ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. పాఠశాలలకు నిరవధిక సెలవులు కొనసాగుతున్న ఈ సమయాన్ని కొందరు చిన్నారులు తమలోని సృజనకు పదును పెట్టుకునేందుకు వినియోగిస్తున్నారు.

విజయవాడకు చెందిన కొందరు విద్యార్థులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థిని శ్రీహర్షిక... పుస్తక పఠనాన్ని విజ్ఞానం పెంచుకోవడానికి, కాలక్షేపానికి అన్నట్లు కాకుండా వెబ్‌పేజీ నిర్వహణకు వినియోగిస్తోంది. తల్లి స్ఫూర్తితో పుస్తక పఠనంపై మక్కువ చూపే శ్రీహర్షిక... తన పాఠ్యాంశాలు, చిన్న, పెద్ద ఆంగ్ల పుస్తకాలు సుమారు 70కి పైగా చదివింది. బాల సాహిత్యం, చరిత్ర వీరులు, ప్రముఖ రచయితల పుస్తకాలను చదివి వాటిపై సమీక్ష చేసి నలుగురికి వాటి గురించి తెలియజేస్తోంది.

పరిమిత సంఖ్యలో కాకుండా ఎక్కువ మందికి తన పుస్తక సమీక్షలు చేరువ చేసేందుకు తల్లిదండ్రులు, సోదరి సహకారంతో యూట్యూబ్ ఛానల్‌ని ప్రారంభించింది శ్రీహర్షిక. చదివిన పుస్తకాలను సమీక్షించి రచయితలతో పాటు పుస్తకంలో అనేక విశేషాలను క్లుప్తంగా 'బుక్ టాకీస్' అనే తన యూట్యూబ్ ఛానల్​లో క్రమం తప్పకుండా ప్రతివారం విశ్లేషిస్తోంది. మానసిక విశ్లేషకుడు, ప్రముఖ రచయిత బీవీ పట్టాభిరామ్ సహా పలువురి నుంచి ప్రశంసలు అందుకున్న ఈ విద్యార్థిని వ్యాసాలు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

ఇంకొందరు చిన్నారులు... చిత్రలేఖనం, సంగీతంలో ప్రతిభను పెంచుకునేందుకు సమయాన్ని వినియోగిస్తున్నారు. పాఠశాలల సెలవులకు ముందు ఇచ్చిన హోంవర్కులకు ఓ గంట సమయం కేటాయించి... ఆ తర్వాత ఇండోర్‌ గేమ్స్‌తోపాటు... ఇతర సృజనాత్మక అంశాల్లో తమదైన గుర్తింపును తెచ్చుకునేందుకు పరితపిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో తల్లిదండ్రులు, నాయనమ్మ, తాతయ్యలు ఈ సెలవుల సమయాన్ని తమ పిల్లలకు పలు భాషల్లో కథలు నేర్పి... వారిని ఆయా భాషల్లో రాటు దేలేందుకు తగిన తర్ఫీదు ఇస్తున్నారు.

లాక్​డౌన్ సమయంలో... ప్రజల నిర్లక్ష్యం వారికే కాకుండా సమాజానికి ఏ మేరకు నష్టం కలిగిస్తోందో వివరించేందుకు మరికొందరు టిక్‌టాక్‌లు, లఘు చిత్రాల ద్వారా సందేశాన్ని ఎక్కువ మంది చెంతకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎనిమిదో తరగతి చదువుతోన్న తన అన్నయ్యతో కలిసి నాలుగో తరగతి విద్యార్థిని సృజనాత్మక అభినయంతో ఓ చిన్నపాటి వీడియోను రూపొందించారు. ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ఖాతాకు తల్లిదండ్రుల సాయంతో ఈ వీడియోను అనుసంధానించాలని నిర్ణయించుకున్నారు.

ఇవే కాకుండా విభిన్న అంశాల్లో చాలామంది చిన్నారులు రాటుదేలుతున్నారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో కలిసి ఎక్కువ సమయం ఇళ్లల్లో ఉంటున్నందునా... తమ సందేహాల నివృత్తికి కొత్త విషయాలపై అనురక్తికి ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండీ... ఆరు నెలల బిడ్డకు అమ్మగా.. బాధ్యతగల ఉద్యోగిగా...

ABOUT THE AUTHOR

...view details