CM Jagan Meet PM Modi: ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి దిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన ఆయన 6.05 గంటలకు బయటికొచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలవరం సవరించిన అంచనాలు, రేషన్ పెంపు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు, కడప స్టీల్‌ప్లాంట్, రెవెన్యూలోటు భర్తీ, తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర రుణ పరిమితిపై వెసులుబాటు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.
జనవరి 3న ప్రధానిని కలిసిన సమయంలో విడుదల చేసిన ప్రకటనలోనూ దాదాపు ఇవే అంశాలున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏపీఎండీసీకి బీచ్ శాండ్ మినరల్ కేటాయింపు, 12 మెడికల్ కాలేజీలకు అనుమతుల అంశాలు సీఎం వినతిపత్రంలో చేరాయి. గతంలో ప్రత్యేక హోదా అంశాన్ని నామమాత్రంగా అయినా చేర్చారు. ఈసారి ఆ ప్రస్తావనే లేదు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే సూత్రప్రాయ అనుమతులు ఇచ్చేశాం, స్థలానుమతులకు రెన్యూవల్ అవసరంలేదని సోమవారం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ రాజ్యసభలో స్పష్టంగా చెప్పినప్పటికీ అదే అంశం ముఖ్యమంత్రి పాత, కొత్త వినతిపత్రాల్లో చోటుచేసుకోవడం విశేషం. రాత్రి 7.30 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, 8.30 గజేంద్రసింగ్ షెకావత్, 9.30 గంటలకు హోంమంత్రి అమిత్‌షాలతోనూ సీఎం భేటీ అయ్యారు. ప్రధానితో చర్చించిన పోలవరం, ఆర్థిక, ఇతరత్రా అంశాలనే వారి దృష్టికీ తీసుకెళ్లి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం ఉదయం 9.15 గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన అనంతరం సీఎం రాష్ట్రానికి తిరుగుపయనమవుతారు.
ప్రధానికి చేసిన విజ్ఞప్తులు ఇవే..
1. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించింది. వాటికి వెంటనే ఆమోదం తెలపాలి. ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ. 31,188 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందులో నిర్మాణ పనుల కోసం రూ. 8,590 కోట్లు, భూ సేకరణ, పునరావాసం కోసం రూ. 22,598 కోట్లు ఖర్చవుతాయి. విభాగాలవారీగా బిల్లుల చెల్లింపు విధానాన్ని సవరించాలి. ఆ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఫలితంగా రూ. 905 కోట్ల బిల్లులను ప్రాజెక్ట్ అథారిటీ తిరస్కరించింది. అందువల్ల విడివిడిగా కాకుండా మొత్తం పనులను పరిగణనలోకి తీసుకోవాలి. నిర్వాసిత కుటుంబాలకు ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి.
2. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపు కోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, కేంద్రం నుంచి 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం, పట్టణ ప్రాంతాల్లోని 50 శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61 శాతం గ్రామీణ, 41 శాతం పట్టణ ప్రజలకు మాత్రమే రేషన్‌ను అందిస్తోంది. దీన్ని సరిదిద్దాలి.
3. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలి.