భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలంటూ...ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రహోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వ్యవసాయ శాఖతోపాటు వివిధ శాఖల ప్రాథమిక అంచనాల మేరకు రాష్ట్రంలో 4 వేల 450 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లగా..,14 మంది ప్రాణాలు కోల్పోయినట్టు లేఖలో వివరించారు. తక్షణ సాయంగా 2,250 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి...సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కోరారు.
మొత్తం 9 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని..,పంట నష్టంతోపాటు రవాణా నిలిచిపోయిన పరిస్థితి ఉందని సీఎం లేఖలో వివరించారు. తీవ్రవాయుగుండం కారణంగా..రాష్ట్రంలో అక్టోబరు 9 నుంచి 13వరకూ భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. ఒక్క రోజే తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరంలో 26.5 సెంటిమీటర్లు, కాట్రేనికోనలో 22.8 సెంటిమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 20.5 సెంటిమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. ఎగువన తెలంగాణా, మహారాష్ట్రల్లోనూ కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరదలు వచ్చాయని పేర్కొన్నారు.