తనలా మరో అమ్మాయి ఉన్మాదుల చెరలో చిక్కుకోరాదన్న ఉద్దేశంతో తేజస్విని చేసిన వీడియోలోని వ్యాఖ్యలు చదివితే చాలు.. తేనె పూసిన కత్తుల నిజ స్వరూపం కళ్లకు కడుతుంది. ప్రేమంటూ ఉచ్చులోకి దించుతారు. ఇంత అందమైన అమ్మాయిని ఇప్పటివరకూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. తనతో ఉంటే జీవితమంతా స్వర్గమేనని నమ్మిస్తారు. ఆ అమ్మాయి ఇక పూర్తిగా తన చెప్పుచేతల్లోకి వచ్చేసిందని నిర్ధారించుకున్నాక ఆమెపై ఆధిపత్యం చెలాయిస్తారు. వేధింపులు, వంచనలతో వికృత మనస్తత్వాన్ని బయటపెడతారు. వాస్తవాలను గ్రహించి ప్రేమోన్మాదుల కోరలనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తే బెదిరింపులకు తెగబడతారు. ఇద్దరి మధ్య సంబంధాలు బాగున్నప్పుడు తీసుకున్న చిత్రాలు, జరిపిన ఫోన్ సంభాషణలను అడ్డు పెట్టుకొని పరువు తీస్తామని హెచ్చరిస్తారు.
వాటికి లొంగితే మరింత రెచ్చిపోతారు. ఖాతరు చేయకుండా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుంటే వెంటాడి మరీ అంతమొందిస్తారు. తాజాగా గుంటూరులో రమ్య హత్య నేపథ్యంలో రాష్ట్రంలో కొన్నాళ్లుగా వరుసగా జరుగుతున్న ప్రేమోన్మాదుల దాడులు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. ఇలాంటి మేక వన్నె పులుల బారినపడి అమాయక యువతులు ఎందుకు.. ఎలా బలవుతున్నారు? మనస్తత్వ నిపుణులు ఏం చెబుతున్నారు? వివరిస్తూ కథనం..
సాలెగూడులో చిక్కుకొని..
యవ్వనంలో ఆకర్షణలకులోనై అమ్మాయిలు ఉన్మాదుల చెరలో చిక్కుకుంటున్నారు. అవతలి వ్యక్తి నేపథ్యం, మనస్తత్వం, వ్యక్తిత్వం వేటిపైనా అవగాహన లేకుండానే మాయలో పడిపోతున్నారు. కల్లబొల్లి కబుర్లన్నీ నిజమేనని, వారిది అసలైన ప్రేమని భ్రమలో ఉంటున్నారు. తీరా అవతలి వ్యక్తిలోని విపరీత ప్రవర్తన ఒక్కొక్కటి బయటపడేకొద్దీ దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ధోరణిని ఉన్మాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరొకరితో చనువుగా ఉండే తనను దూరం పెడుతోందన్న అనుమానంతో కొందరు, తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనే పగతో ఇంకొందరు ప్రాణాలు తీసేందుకు వెనకాడటం లేదు. ప్రేమ పేరిట వెంటపడుతూ వేధించటమే హీరోయిజంగా చిత్రీకరిస్తున్న సినిమాల ప్రభావం కూడా యువతపై కనిపిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిల వెంటపడటాన్ని వీరు గర్వంగా భావిస్తుంటారని వివరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో వల
ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య చదివే అమ్మాయిలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లోనే అల్లరిచిల్లరగా తిరిగే యువకులు పరిచయమవుతున్నారు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ మధ్యలో మానేసి చెడు సావాసాల్లో మునిగి తేలే వీరంతా అమ్మాయిలకు వల వేయటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. స్నేహితులనుంచి ఖరీదైన బైక్‌లు తీసుకోవటం, వాటిపై ఫొటోలు తీసుకోవటం, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, ఫేస్‌బుక్‌వంటి మాధ్యమాల్లో వాటిని పోస్టు చేసి అమ్మాయిలను ఆకట్టుకోవటం వీరి పని. అమ్మాయిలు పెట్టే పోస్టులకు లైకులు, కామెంట్లు పెడుతూ ఆకట్టుకుంటారు. వారితో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించటం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశమొస్తే ప్రేమ పేరిట ఉచ్చులోకి దించేంతవరకూ మభ్యపెడుతుంటారు.తాజాగా గుంటూరు జిల్లాలో దళిత యువతి రమ్యను అంతమొందించిన శశికృష్ణ కూడా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే పరిచయమయ్యాడు.
తల్లిదండ్రులు అండగా నిలవాలి