ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలమని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో చంద్రబాబు ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక.. ఇతరత్రా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఎప్పటికప్పుడు తనవంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. సంక్షోభం ఎప్పుడు వచ్చినా ఆదుకునేందుకు తెదేపా ముందుంటుందని పేర్కొన్నారు. సంక్షోభాన్ని నివారించకపోతే పెను ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు.
కరోనాపై ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు - కరోనా బాదితులతో చంద్రబాబు సమావేశం న్యూస్
కరోనా వల్ల దెబ్బతిన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్ కుటుంబాలకు 50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో రోజుకు 10వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయని..అన్ని జిల్లాలు కరోనా బారిన పడ్డాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని నియంత్రణ చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. వనరుల వినియోగంపై దృష్టి పెట్టలేదని ధ్వజమెత్తారు. పద్ధతి ప్రకారం చేస్తేనే కరోనాను నియంత్రించగలమన్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనాపై అవగాహన పెంచేందుకు చంద్రబాబు ఓ వీడియోను విడుదల చేశారు.
ఇదీ చదవండి: తెలుగు పరిణామ క్రమానికి మరో సాక్ష్యం.. అరుదైన శిలా శాసనం లభ్యం