ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్' విజయం సాధించేందుకు విజన్ ఎంతో దోహదపడుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో నేటితరం అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే అది ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని వాటిని అధిగమించే పరిష్కారాలతోనే సమర్థత బయటపడుతుందని వెల్లడించారు. ధనం కంటే విజ్ఞానం ఎంతో విలువైందన్న చంద్రబాబు.. మంచి విజ్ఞానం సంపాదించుకుంటే అదే వారిని ఉన్నత స్థాయిలో ఉంచుతుందన్నారు. ముంబయి ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ముంబయి ఐఐటీకి సంబంధించిన శైలేష్ జె.మెహతా మేనేజ్‌మెంట్ స్కూల్ ‘అవెన్యూస్’ పేరుతో అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్ నిర్వహించింది. ఇందులో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్ లో చంద్రబాబు పాల్గొన్ని విద్యార్థులకు తన సందేశం ఇచ్చారు.
ముంబయి ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు ఆన్లైన్ సమావేశం సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సమర్థత బయటపడుతుంది. కరోనా సంక్షోభాలను వివిధ దేశాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. కరోనా సంక్షోభం కారణంగా కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. వర్చువల్, డిజిటల్ వేదికలు సంక్షోభంలో వచ్చిన వినూత్న ఆలోచనలే. వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించి అగ్రస్థానంలో నిలిపాం. సులభతర వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకున్నాం.
- చంద్రబాబు, తెదేపా అధినేత
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను అనేక సవాళ్లతో ప్రారంభించామని చంద్రబాబు వివరించారు. తుపానును ఆపలేకపోయినా హుద్ హుద్ చేసిన నష్టం నుంచి విశాఖ నగరాన్ని అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలబెట్టామని గుర్తు చేశారు. హుద్ హుద్ కు ముందు హుద్ హుద్ తర్వాత అని పోల్చేలా విశాఖను తీర్చిదిద్దామన్నారు. భూగర్భ కేబుల్ వ్యవస్థ, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, రహదారుల అభివృద్ధివంటివి హుద్ హుద్ సవాళ్లను అవకాశంగా మలచుకోవటంతోనే సాధ్యమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని గ్రీన్ ఫీల్డ్ కాన్సెప్ట్ తో తలపెట్టామని వివరించారు. విద్యుత్, ఏసీ, డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థ అంతా భూగర్భంలోనే ఉండేలా ఆధునిక విధానాలతో ప్రణాళికలు రచించామని తెలిపారు. మనిషి సగటు ఆరోగ్య జీవితం ప్రస్తుతం 59ఏళ్లే ఉన్నందున దానిని పెంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆనంద జీవితం అందించేలా కాలుష్య రహిత నగరంగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు చంద్రబాబు వెల్లడించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. ఇదే సమ్మిట్ లో అరవింద్ పనగరియా, శామ్ పిట్రోడా, అనిల్ కకోద్కర్, వినీత్ నారాయణ్, జావెద్ అక్తర్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్