పన్నులు, విద్యుత్తు ఛార్జీల పెంపుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీసిన మహిళల తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ప్రజల జేబులు గుల్ల చేసిన డబ్బులతోనే సంక్షేమం అంటూ మోసం చేస్తున్న వైనంపై గళమెత్తిన సోదరీమణుల ఆవేదనకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది? జగన్ జేబులోంచి ఇచ్చారా.. అసలు దోచింది ఎంత.. ఇచ్చింది ఎంత.. మేము వాటితో బతుకుతున్నామా.. అంటున్న ఆడబిడ్డల ప్రశ్నలకు ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రభుత్వ మోసాన్ని, తమ కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన వారి తెగువ స్ఫూర్తిదాయకం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పత్రికా కథనం, వీడియోను షేర్ చేశారు.
కష్టాల్లో కార్మిక లోకం: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి పవర్ హాలిడేలతో సరిగా నడవటం లేదని, దీంతో కార్మిక లోకం తల్లడిల్లిపోతోందని ఆదివారం చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామికులు, కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. తెదేపా హయాంలో పరిశ్రమల స్థాపనతో లక్షలమంది ఉపాధి పొందారు. కానీ నేడు కార్మికులకు కనీసం ప్రమాద బీమా ఇవ్వలేని పరిస్థితి. ఇప్పటికైనా కార్మికులంతా ఒక్కతాటిపైకొచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై పోరాడాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆదివారం మేడే వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మేడే జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ డి.రామారావు తదితరులు పాల్గొన్నారు.