Chandrababu Tour in jangareddygudem: తెదేపా అధినేత చంద్రబాబు.. నేడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో కలకలం రేపిన నాటుసారా మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. సారా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన విమర్శించారు. కల్తీసారా కారణంగా.. బాధితులు చనిపోతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ప్రాణాలు పోతున్నా స్పందించరా అని మండిపడ్డారు. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా చర్యలు లేవని ధ్వజమెత్తారు. మరణాలపై ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న భయాందోళనలను పోగొట్టాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు.
18కి చేరిన మృతుల సంఖ్య..
Death Toll in Jangareddygudem:పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు భయపెడుతూనే ఉన్నాయి. శనివారం మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించడంతో నాలుగు రోజుల వ్యవధిలో మృతుల సంఖ్య 18కి చేరింది. సారా తాగే అలవాటున్న నలుగురు అనారోగ్య కారణాలతో ఉదయం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వీరిలో ఉప్పలమెట్టకు చెందిన వెంపల అనిల్ కుమార్ (35), గౌరీశంకరపురానికి చెందిన సునాని ఉపేంద్ర (30) గంటన్నరలోనే కన్నుమూశారు. మృతుడు అనిల్ సోదరుడు సర్వేశ్వరరావు, మరొకరు బొల్లా నేతాజీల ఆరోగ్యం నిలకడగా ఉంది.
తెదేపావి శవ రాజకీయాలు: మంత్రి ఆళ్ల నాని
నాటు సారా కలకలం వెనుక రాజకీయ కారణాలున్నాయని మంత్రి ఆళ్ల నాని వివరించారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఆయన బాధితులను పరామర్శించారు. వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరిహారం వస్తుందని తెదేపా నాయకులు ప్రలోభపెట్టి ఇదంతా చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రేపోమాపో ఇక్కడికి చంద్రబాబు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు.