వైకాపా కుట్ర రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ బలపరిచిన అభ్యర్థులు, ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంచరీ దిశగా పెట్రోల్, డీజిల్ ధరలు వెళ్తుంటే.. పప్పుల ధరలు డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రూల్ ఆఫ్ లా లేకుండా చేస్తూ ప్రభుత్వ ఉగ్రవాదం తీసుకొచ్చారని మండిపడ్డారు. తెదేపా ప్రభుత్వం ధరల నియంత్రణకు చేపట్టిన విధానాలు, వైకాపా విఫలమైన తీరు ప్రజలకు వివరించాలని దిశానిర్ధేశం చేశారు. జగన్ తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టుపెడుతున్న తీరు ప్రజలకు తెలియజేయాలన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగినా.. జగన్ నోరు ఎందుకు మెదపడంలేదో నిలదీయాలన్నారు. వైకాపా అవినీతి ప్రతి ఊళ్లోను ఉందన్న ఆయన.. ఇళ్లస్థలాల్లోనే 6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమితోనే వైకాపా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు.
వైకాపా దౌర్జన్యాలను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు కనబరిచిన పట్టుదలే పంచాయతీ ఎన్నికల్లోనూ చూపాలని అభ్యర్థులకు సూచించారు. వైకాపా ప్రభుత్వం తప్పుడు పనులతో ఇప్పటికే అన్ని విధాలా అభాసుపాలైందన్నారు. మద్యం సీసాలు తెచ్చిపెట్టి తెదేపా బలపరిచిన అభ్యర్థులపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధిని వివరించటంతో పాటు వైకాపా హింసా విధ్వంసాలు, రాష్ట్రానికి వచ్చిన చెడ్డపేరుపై ప్రజల్లో చైతన్యం పెంచాలన్నారు.