కరోనా బాధితులకు పరిహారం చెల్లింపు డిమాండ్‌తో ఈ నెల 29న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిరసనకు దిగనున్నారు. కరోనా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డుదారులకు రూ.10వేలు ఇవ్వాలన్నారు. డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరసన కొనసాగనుందని..పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబుతో పాటు 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, కరోనా బాధితులు వర్చువల్‌గా నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి.
"రాష్ట్రంలో దాదాపు కోటి మంది కరోనా వల్ల ఉపాధి కోల్పోయారు. నిరుద్యోగంలో ఏపీ దక్షిణాదిలోనే అగ్ర స్థానంలో ఉంది. ఇచ్చిన హామీ మేరకు జగన్ 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలి. ఉద్యోగాల భర్తీకి పోరుబాట పట్టిన యువతకు తెదేపా మద్దతు ఉంటుంది. రైతులకు పెండింగ్ బకాయిలు రూ.3,600 కోట్లు వెంటనే చెల్లించాలి. రైతు ఉత్పత్తులన్నీ కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. పట్టణాల్లో పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ హక్కులు కాపాడటంతో పాటు పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇచ్చి తరలించాలి. ఇసుక అక్రమ రవాణాతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతోంది. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి భవన నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలి. 125 వ్యాపారాల్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలి."- చంద్రబాబు