విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో సత్య ప్రమాణానికి రావాలని సవాల్ చేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను చంద్రబాబు అభినందించారు. విశాఖలో జే గ్యాంగ్ భూకబ్జాలు, అవినీతి అక్రమ వసూళ్లపై గట్టి పోరాటం చేస్తున్నారన్నారు. చలో పులివెందుల కార్యక్రమాన్ని బిటెక్ రవి, ఎంఎస్ రాజు, వంగలపూడి అనిత, లింగారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు విజయవంతం చేశారని తెలిపారు. కడప, అనంతపురం జిల్లాల్లో ఎస్సీ మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆందోళనల్లో తెదేపా నాయకులు పాల్గొని బాధిత కుటుంబాలకు అండగా ఉండి వారిలో మనోధైర్యం పెంచారని తెలిపారు.
పలాసలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహాన్ని కూల్చుతానన్న మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లాలో ఆందోళనలు జరిపిన గౌతు శిరీషకు ఫోన్ చేసి చంద్రబాబు అభినందించారు. ఆందోళనల్లో పాల్గొన్న అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్, కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకులను ప్రశంసించారు. అనపర్తిలో వైకాపా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అవినీతిపై ధ్వజమెత్తి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు అభినందించారు. గుడిలో ప్రమాణం చేద్దామన్న రామకృష్ణారెడ్డి, తన సవాల్ ద్వారా అనపర్తి ఎమ్మెల్యే అవినీతిని ప్రజల్లో నిలదీశారని వెల్లడించారు.