ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాతో వైకాపా చెలగాటమాడుతోంది: చంద్రబాబు - కరోనాపై ప్రభుత్వానికి చంద్రబాబు సూచనలు న్యూస్

కరోనా కేసులు ఎక్కువ ఉన్న జిల్లాల్లో తక్కువ డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెట్టడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. తక్కువ కేసులున్న చోట వేలాది డాక్టర్లను, ఆరోగ్య సిబ్బందిని పెట్టారని విమర్శించారు.

chandrababu on ysrcp govt about corona
chandrababu on ysrcp govt about corona

By

Published : Apr 16, 2020, 5:07 PM IST

మాస్క్​ల తయారీలో డ్వాక్రా మహిళలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి చంద్రబాబు సూచించారు. వారికి జీవనోపాధితో పాటుగా స్థానికంగానే మాస్క్​లు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల ద్వారా మాస్క్ ల తయారీని ప్రోత్సహించాలన్నారు. రాష్టంలో కరోనా వైరస్ తీవ్రత, కేంద్ర ప్రభుత్వ ఉపశమన చర్యలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తదితర అంశాలపై చంద్రబాబు తెదేపా సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వివేకంగా వ్యవహరించాలని కోరారు.

వైకాపా వాళ్లు గుంపులుగా ఉంటే ఏం కాదా?

తెలుగుదేశం బాధ్యతాయుతమైన పార్టీగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం బాధాకరమని మండిపడ్డారు. భౌతిక దూరం పాటిస్తూ.. తెదేపా కార్యకర్తలు సాయం చేస్తే.. నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం చేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా వాళ్లు గుంపులుగా పోగై సాయం పేరుతో ప్రదర్శనలు చేస్తే నోటీసులు, కేసులు ఉండవా అని ప్రశ్నించారు. ప్రపంచం అంతా ఒకవైపు కరోనాతో గడగడలాడుతుంటే వైకాపా నేతలు మాత్రం కరోనాతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టుకు వెళ్లడమెందుకు?

తానే లేఖ రాశానని, దానిని కేంద్రం ధ్రువీకరించిందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ చెబితే, అది ఫోర్జరీ అని ఎంక్వైరీ చేయాలని విజయసాయి రెడ్డి లేఖ రాయడం ఆయనలోని విషపు ఆలోచనలకు అద్దం పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రైతులు, పేదలను ఆదుకునే మార్గాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ లాభాల కోసమే వైకాపా నేతల దృష్టి ఉందని విమర్శించారు.

ఏ మీడియంలో చదవాలి అనే ఆప్షన్ విద్యార్థులకు, తల్లిదండ్రులకే ఉండాలని తెదేపా చెబితే.. లేనిపోని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి.. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం సరికాదన్నారు. హైకోర్టు తీర్పును గౌరవించాల్సింది పోయి, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాష్ట్రప్రభుత్వం చెప్పడం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఆగని కరోనా... 534కు చేరిన కేసులు

ABOUT THE AUTHOR

...view details