కోనసీమలో అల్లర్లకు వైకాపాయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో చిచ్చు రేపారన్నారు.
"అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైకాపాదే. అమలాపురంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే తగులబెట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు. వాళ్లే తగలబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు. ప్రతిపక్షాలపై తోయడం జగన్‌కు అలవాటుగా మారింది. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా?. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను భయపెడుతున్నారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏం చెప్పాలని బస్సు యాత్ర చేపడుతున్నారు. ఎస్సీలకు చెందిన 28 పథకాలు రద్దు చేశారు. డ్రైవర్‌ను అనంతబాబు చంపేస్తే.. కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు."- చంద్రబాబు, తెదేపా అధినేత
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మహానాడు కోసం మంగళగిరిలోని తెదేపా కార్యాలయం నుంచి ఒంగోలుకు ప్రదర్శనగా వెళ్లిన చంద్రబాబు దారిలో చిలకలూరిపేట సమీపంలో తెదేపా కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. 'క్విట్ జగన్... సేవ్ ఆంధ్రప్రదేశ్' నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.