తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుంచి ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తిరుపతిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం ఎన్టీఆర్ భవన్లో తిరుపతి ఉప ఎన్నికపై కమిటీ సభ్యులతో అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 70 క్లస్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి క్లస్టర్‌కు ఒక సీనియర్ నేతను ఇంఛార్జ్‌గా నియమించాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
పార్టీని పట్టించుకోకుంటే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని చంద్రబాబు నియోజకవర్గ ఇంఛార్జ్‌లను హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్లో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం.. 16 శాసనసభ నియోజకవర్గాల్లో బాధ్యులను నియమించాల్సి ఉండగా.. మరో 31 శాసనసభ నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లు సమర్థవంతగా పనిచేయట్లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 47 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సంబంధిత పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను ఆయన ఆదేశించారు.