రెండో దశ ఎన్నికలు జరిగిన స్థానాల్లో తెదేపా మద్దతుదారులు 1,033, తెదేపా పొత్తుతో గెలిచినవారు 65 కలిపి మొత్తం 1,095 స్థానాల్లో (39.52%) విజయం సాధించారని వివరించారు. మంగళగిరిలో చంద్రబాబు ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ‘రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. శనివారం రాత్రి 10 గంటల వరకు తెదేపా మద్దతుదారులకు ఏకపక్షంగా వచ్చాయి. అక్కణ్నుంచి చీకటి రాజకీయం మొదలైంది. విద్యుత్తు సరఫరా నిలిపేశారు. ఏజంట్లను బలవంతంగా బయటకు పంపారు. పోలీసులతో బెదిరించారు. చెల్లని ఓట్లను కలిపి లెక్కించారు. తెదేపా బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట్ల.. వైకాపా మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటింపజేశారు. మా వాళ్లకు 200 నుంచి 300 ఓట్ల మెజార్టీ వచ్చినా రీకౌంటింగ్‌కు ఆదేశించారు. అవతలివాళ్లు రెండు ఓట్ల తేడాతో గెలిచినా రీకౌంటింగ్‌కు అంగీకరించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 10% ఫలితాలు ఇలా మార్చేశారు’ అని ఆగ్రహం వెలిబుచ్చారు. ‘హైకోర్టులో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాక కూడా శ్రీకాళహస్తిలో 14, తొట్టంబేడులో మూడు, ఏర్పేడులో 17.. మొత్తం 34 మంది నామినేషన్లను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో అభ్యర్థికి చెప్పలేదు. ఇలా బరితెగిస్తున్న అధికారుల్లో ఏ ఒక్కరినీ వదలబోమ’ని హెచ్చరించారు.
ఎస్‌ఈసీ గట్టిగా చెబితే ఇవన్నీ జరుగుతాయా?
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు చేపట్టి ఉంటే.. శ్రీకాళహస్తిలాంటి సంఘటనలు జరిగేవి కావని చంద్రబాబు పేర్కొన్నారు. పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే విషయమై ఎస్‌ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ‘పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పెట్టెలను మండల కేంద్రానికి చేర్చి లెక్కించాలి. సర్పంచి అభ్యర్థుల ఓట్లనే ముందు లెక్కించాలి’ అని డిమాండు చేశారు.