ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాని చెప్పినా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు: చంద్రబాబు - కరోనాపై చంద్రబాబు వెబినార్ తాజా వార్తలు

కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాల వారితో తెదేపా అధినేత చంద్రబాబు వెబినార్ నిర్వహించారు. కరోనా సమస్యకు ఇప్పుడిప్పుడే పరిష్కారం లభించే సూచనలు లేవని చంద్రబాబు పేర్కొన్నారు. కరోనా రెండోసారి తిరగబడుతోందన్నారు.

chandrababu naidu webinar on problems with corona
chandrababu naidu webinar on problems with corona

By

Published : Oct 8, 2020, 5:02 PM IST

Updated : Oct 9, 2020, 5:00 AM IST

కరోనాపై ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. కొవిడ్‌ బాధితులకు రూ.2 వేల సాయమూ ఇవ్వలేకపోయారని.. అన్నీ వదిలిపెట్టి రాష్ట్రంలో సమస్యలే లేవన్నట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘డబ్బులున్నవారు నేరుగా హైదరాబాద్‌ వెళ్లి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పేదరికంతో ఇక్కడి ఆసుపత్రుల్లో చేర్చి, వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోలేక బాధపడుతున్న వాళ్లు, కుటుంబసభ్యుల్ని కోల్పోయి కడచూపూ దక్కనివారు చాలామంది ఉన్నారు’ అని పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులు, చేనేత కార్మికులు, వృత్తి కళాకారుల్ని ఆదుకోవాలని డిమాండు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో వాహనాలే నడవకపోతే పన్నులెలా చెల్లిస్తారు? ఏడాదిపాటు పన్నులు రద్దు చేస్తామని చెప్పలేరా అని ప్రశ్నించారు.‘కరోనా లాక్‌డౌన్‌- ప్రజల జీవనోపాధిపై ప్రభావం’ అంశంపై గురువారం చంద్రబాబు వెబినార్‌ నిర్వహించారు.

‘కరోనాపై పోరాటం’ పేరుతో తెదేపా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో సమస్యలు నమోదు చేసుకున్న పలువురితో ఆయన మాట్లాడారు. గోదావరి వరదలతో పంటలు నష్టపోయామని, ఇప్పటిదాకా సమీక్ష కూడా లేదని, రెండో పంటకు విత్తనాలూ ఇవ్వలేదని పోలవరం నుంచి సుభాష్‌ చంద్రబోస్‌ వివరించారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరి జీవనోపాధి కోల్పోయామని చేనేత కార్మికురాలు విజయమ్మ ఆవేదన వెలిబుచ్చారు. ఆరు నెలలుగా రెక్కాడినా డొక్కాడటం లేదని, ప్రభుత్వం పట్టించుకోలేదని ఏటికొప్పాకకు చెందిన సత్యనారాయణ వాపోయారు. పీఈటీ, పీడీలు లేని ప్రభుత్వ పాఠశాలల్లో 250 మంది పొరుగుసేవల్లో పనిచేస్తున్నాం.. ప్రభుత్వం మారాక జీతాలు రావడం లేదని పర్చూరుకు చెందిన రామకోటేశ్వరరావు చెప్పారు.

అన్నింటికీ ప్యాకేజీలేనా?

సెప్టెంబరు 3న నాన్నమ్మ చనిపోతే.. దూరం నుంచి చూడ్డానికి రూ.900 అడిగారు. అంబులెన్స్‌ నుంచి దించడానికి రూ.1,500, చితి పెట్టడానికి రూ.6వేల నుంచి రూ.10వేల ప్యాకేజీ పెట్టారు. మరణ ధ్రువీకరణ కోసం వెళ్తే పేరు తప్పుగా ఉందంటూ రూ.2వేలు అడుగుతున్నారు. - కిశోర్‌ నామాల, విశాఖపట్నం

సంపాదన లేకుండా పన్నులెలా కట్టాలి?

నా తుపాన్‌ వాహనం లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉండిపోయింది. అయినా ప్రభుత్వం పన్ను వసూలు చేసింది. ఇప్పుడు మరో విడత పన్ను రూ.7,150 చెల్లించాలి. బీమా కిస్తీ రూ.30,200 కట్టాలి. రూపాయి సంపాదన కూడా లేనప్పుడు పన్నులు ఎలా కడతాం? - అంజి, వాహన యజమాని

ఇరవై రోజుల్లో ఇద్దర్ని కోల్పోయాం

ఇరవై రోజుల్లో నాన్న, నానమ్మను కోల్పోయాం. నాన్నకు సీరియస్‌గా ఉందంటే అంబులెన్స్‌ ఆలస్యంగా వచ్చింది. ఆసుపత్రిట్రామాకేర్‌లో బల్లపై వదిలేశారు. వైద్యులేమో డ్యూటీ దిగాం, కొత్త వారొస్తారన్నారు. చేతగాని ప్రభుత్వంలో జరిగిన తప్పులతో 53 ఏళ్లకే నాన్న చనిపోయారు. నాయనమ్మ మరణ ధ్రువీకరణపత్రం ఇమ్మంటే డబ్బులడుగుతున్నారు. - రాజశేఖర్‌, నెల్లూరు

ఇదీ చదవండి:

'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే'

Last Updated : Oct 9, 2020, 5:00 AM IST

ABOUT THE AUTHOR

...view details