తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్లైన్లో సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం, ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని నిరసన వ్యక్తం చేసింది. ఈ ఏడాది మే 20న కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగిన బడ్జెట్ సమావేశాన్ని గుర్తు చేసిన నేతలు, నవంబర్ 19కి ఆరునెలలు పూర్తవుతున్నందున అసెంబ్లీ నిర్వహించటం ప్రభుత్వానికి అనివార్యమైందని తప్పుబట్టింది.
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రతిపక్షానికి భయపడి సమావేశాలను ఒక్క రోజుకే పరిమితం చేయటం పలాయనవాదానికి నిదర్శనమని నేతలు విమర్శించారు. కేంద్రం ఇంధనం ధరలు తగ్గించినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించకుండా మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తానని ప్రకటించి.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు వంటి హామీలను గాలికొదిలేసి.. నిరసన గళం వినిపిస్తున్న ఉద్యోగులపై ఏసీబీని ఉసిగొతూ వ్యవహరిస్తున్న తీరు దారుణమని నేతలు సమావేశంలో ఆక్షేపించారు. రూ. 25 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల దందా, నిత్యావసరాల ధరల పెంపు, ప్రజలపై పన్నుల భారం, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ సమస్య, కేంద్ర ప్రాయోజిక పథకాల నిధుల మళ్లింపు, మత్స్యకారుల సమస్యలు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య, అమరావతి ఉద్యమం, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాల్సిందేనని నేతలు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లతో అరాచకాలు చేయటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని మండిపడ్డారు. ఎయిడెడ్ ఆస్తులు, రాజధాని పరిరక్షణ, గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కుతున్న విద్యార్థులు, రైతులపై పోలీసుల లాఠీఛార్జీలు దుర్మార్గమని ధ్వజమెత్తారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు వస్తున్న ప్రజామద్దతు ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజావ్యతిరేకతను బయటపెడుతోందని సమావేశం అభిప్రాయపడింది.