CBN REVIEW ON KUPPAM AND RAJAMPET: క్షేత్ర స్థాయిలో పనిచేయకుండా కబుర్లు చెబితే ఇకపై కుదరదని కుప్పం నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కుప్పం, రాజంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్థానిక నేతలతో విడివిడిగా బాబు సమీక్ష నిర్వహించారు. పార్టీలో ప్రక్షాళన కుప్పం నుంచే ప్రారంభిస్తానని, వచ్చే ఆరు నెలలపాటు కుప్పంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు.
పార్టీకి నష్టం చేసేవారిని, క్షేత్ర స్థాయిలో పని చేయకుండా తన దగ్గరకొచ్చి కబుర్లు చెప్పేవారికి ఉపేక్షించబోనని.. రాబోయే 6 నెలల్లో కొత్త రక్తంతో పార్టీకి జవసత్వాలు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇకపై పార్టీని సమర్థంగా ముందుకు నడిపించేవారికి పట్టం కడతామన్నారు. మొహమాటాలు, లాలూచీ వ్యవహారాలతో ప్రత్యర్థులతో కుమ్మక్కయ్యే వారికి స్థానం ఉండదని తేల్చి చెప్పారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులతో బుధవారం చంద్రబాబు చర్చించారు. కుప్పంలో పార్టీని సమర్థంగా నడిపేందుకు సమన్వయ కమిటీని నియమిస్తానన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 350 ఓట్ల తేడాతో ఏడు వార్డుల్లో ఓడిపోయామని ఆయన తెలిపారు.
పార్టీ నాయకులు కొందరు అమ్ముడుపోయారంటూ ఒక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై.. అందరి జాతకాలూ తన దగ్గరున్నాయని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. స్థానిక నాయకులు అధికార పార్టీ ఆగడాలతో కొంత భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోందన్నారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుప్పంలో దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు మహిళలు చొరవ చూపించారని, పోరాటపటిమ కనబరిచారని చంద్రబాబు కొనియాడారు.
అందరూ రహస్య నివేదికలివ్వండి..
కుప్పం మున్సిపాలిటీలో పోటీ చేసిన తెదేపా అభ్యర్థులు తాము ఎదుర్కొన్న అన్ని సమస్యలపై నివేదికలు తయారుచేసి, తనకు పంపాలని చంద్రబాబు సూచించారు. ప్రతి నివేదికనూ చూసి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. ‘ప్రత్యర్థులు నీచ రాజకీయాలకు దిగారు. వారిని దీటుగా ఎదుర్కొనే సమర్థ నాయకత్వం అవసరమని భావిస్తున్నాను. కుప్పంలో కొన్ని వార్డులకు అభ్యర్థుల్ని చివరి నిమిషంలో ఎంపిక చేయడమూ కొంత నష్టం కలిగించింది.