నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించుతున్నాయని... ప్రజల ధన, మాన ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తమను ఎవరూ కట్టడి చేయలేరనే ధీమాతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్నారు. రక్షా బంధన్ రోజే 2 జిల్లాలలో గిరిజన ఆడబిడ్డల ప్రాణాన్ని, మానాన్ని కాలరాశారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం రాక్షసత్వమని, వెలిగోడు గ్యాంగ్ రేప్‌పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు భద్రత లేదని డీజీపీకి చంద్రబాబు లేఖ - డీజీపీకి చంద్రబాబు లేఖ న్యూస్
వైకాపా పాలనలో రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి గిరిజన మహిళలకు భద్రత లేదంటూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. నకరికల్లు మండలంలో గిరిజన మహిళ హత్య, వెలిగోడు మండలంలో గిరిజన మహిళ గ్యాంగ్ రేప్ ఘటనల గురించి లేఖలో ప్రస్తావించారు.
14 నెలల్లోనే 400మందికిపైగా ఆడబిడ్డలపై అఘాయిత్యాలు, 15చోట్ల గ్యాంగ్ రేప్‌లు, 8మంది మహిళల హత్యలు, అవమానంతో 6 మంది మహిళల ఆత్మహత్యలు జరిగాయని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. పోలీసుల్లో కొందరు రాజకీయ ప్రలోభాలు, పైరవీలు, అలసత్వం, అవినీతికి పాల్పడితే, అరాచక శక్తులు ఏ విధంగా బరితెగిస్తాయో మన రాష్ట్రంలో జరుగుతున్న దుర్ఘటనలే నిదర్శనమన్నారు. తక్షణమే స్పందించి అరాచక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చంద్రబాబు లేఖలో కోరారు.
ఇదీ చదవండి:పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్ కో