CBN LETTER: రాష్ట్రంలో నేరాలు అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో గత 4 రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైంరేట్ వివరాలను లేఖలో పొందుపరిచారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు జతచేశారు.
రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నమైందని ఆరోపించారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా పరిస్థితులున్నాయని... పెట్రేగుతున్న వైకాపా గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతుందని మండిపడ్డారు. జి.కొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్యకు.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కారణమని స్వయంగా మృతుడు భార్య చెప్పారని గుర్తు చేశారు.
శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలోనూ పోలీసుల విఫలమయ్యారని విమర్శించారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వేస్టేషన్లో దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని లేఖలో వెల్లడించారు. గంజాయి సరఫరాలో వైకాపా నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.