CHANDRABABU: మంత్రి కొడాలి నాని పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా గుడివాడలో క్యాసినో ఏర్పాటుచేసి రాష్ట్రం పరువు గంగలో కలిపారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మంత్రికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్‌లో కోడి పందేలు, గుండాట, పేకాట, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారని మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల ముసుగులో జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతుంటే... ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన సోమవారం ఆన్‌లైన్‌లో జరిగిన పార్టీ వ్యూహకమిటీ సమావేశంలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. పండగ వేళ మంత్రి కనుసన్నల్లో మహిళల చేత రికార్డింగ్ డ్యాన్సులు వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికి బాధ్యులైన మంత్రిపైన, పోలీసు అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండు చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం సులభతర వాణిజ్యం ఇతర ఎన్నో కార్యక్రమాల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిస్తే... జగన్ హయాంలో క్యాసినో సంస్కృతి, పేకాట క్లబ్బులు, మాదకద్రవ్యాలు, గంజాయి, అశ్లీల నృత్యాల్లో రాష్ట్రం నం.1గా నిలిచిందని, అభివృద్ధి అంటే ఇదేనా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా థర్డ్‌వేవ్ విజృంభించి, ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని ధ్వజమెత్తారు. 12కుపైగా రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రభుత్వం పాఠశాలలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. ‘రాష్ట్రంలో వారం రోజుల్లో కరోనా పాజిటివిటీ రేటు 4.05 నుంచి 15.22 శాతానికి పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం సబబు కాదు. తరగతులు తక్షణం నిలిపివేయాలి’ అని డిమాండ్ చేశారు. కరోనా బాధితులకు అమెరికాకు చెందిన వైద్యుడు ఈదర లోకేశ్వరరావుతో కలసి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, పార్టీ కేడర్ సంయుక్తంగా సేవలందించాలని సమావేశంలో నిర్ణయించారు.
చంద్రయ్యది రాజకీయ హత్య కాదని ఎస్పీ ఎలా చెబుతారు?
‘తెదేపా నాయకుడు చంద్రయ్యది రాజకీయ హత్య కాదని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఎస్పీ అలా చెబుతుంటే.. మరోపక్క జొన్నలగడ్డలో వైఎస్ విగ్రహం తొలగింపు, చంద్రయ్య హత్యకు ప్రతీకార చర్యగా జరిగిందని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొనడం వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది’ అని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు
తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పండ్లు పంచడం, రక్తదాన శిబిరాలు వంటివి నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. పార్టీ ప్రారంభించిన చైతన్యరథం ఇ-పేపర్ 30 లక్షల మందికి వాట్సప్ ద్వారా చేరుతోందని వివరించింది. సమావేశంలో సీనియర్ నేతలు కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వర్ల రామయ్య, దేవినేని ఉమా, బండారు సత్యనారాయణమూర్తి, బోండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర, రాజేంద్రప్రసాద్, టీడీ జనార్ధన్, పట్టాభిరాం పాల్గొన్నారు.
* ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.