ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రజాపక్షంగా పనిచేసే ప్రతిపక్షాలపై దాడి ప్రజలపై దాడేనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా అప్రజాస్వామిక పోకడలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఏమైనా నిషిద్ధ ప్రాంతమా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్దకు పోకుండా అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఏడాదిన్నరగా పోలవరం పనులపై నిర్లక్ష్యం, ముంపు బాధితుల పునరావాసాన్ని గాలికి వదిలేయడం, ఇప్పుడు తాజాగా ఎత్తు తగ్గింపుపై ప్రచారం నేపథ్యంలో పోలవరం సందర్శనకు వెళ్తున్న సీపీఐ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం వైకాపా దమనకాండకు పరాకాష్టని ధ్వజమెత్తారు.
తెదేపా పాలనలో, వైకాపా పాలనలో తేడాలను ప్రజలే గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం పనుల పరిశీలనకు తెదేపా ప్రభుత్వమే దగ్గరుండి ప్రజలను తీసుకెళ్లి చూపించిందని, వేలాది టిప్పర్లు, భారీ మెషీనరీ, వేలాది కూలీలతో కోలాహలంగా పనులు జరిగే పోలవరం అప్పట్లో పర్యటక ప్రాంతంగా మారిందని గుర్తు చేశారు. తమ హయాంలో 72 శాతం పనులను శరవేగంగా పూర్తి అయ్యాయని.. వైకాపా వచ్చాక 18 నెలలుగా పోలవరంపై నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.