దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు జరుగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల నిలదీతలే అందుకు ప్రత్యక్ష సాక్యమన్నారు. తెదేపా సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివేనని విమర్శించారు. తెదేపా ప్రభుత్వ పథకాలకు, తండ్రీ కొడుకుల పేర్లు తగిలిస్తున్నారని ఆక్షేపించారు. 0.25శాతం అప్పు పరిమితి కోసం 18లక్షల రైతుల జీవితాలతో చెలగాటం చేస్తున్నారని మండిపడ్డారు.
వైకాపా దుర్మార్గాలను అడ్డుకుని రైతుల ప్రయోజనాలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి టాప్ ర్యాంక్ తెదేపా తెస్తే... పారిశ్రామిక వేత్తలను బెదిరించి, వైకాపా ప్రభుత్వం టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందని ధ్వజమెత్తారు. కియా రావడం వైకాపాకి ఇష్టం లేదన్నారు. వైకాపా బెదిరింపుల వల్లే కియా ఆగ్జిలరీ యూనిట్లు 17 వేరే రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు.