ఒక్క అవకాశం ఇవ్వమంటూ ముద్దులు పెట్టి అడిగిన జగన్.. గద్దెనెక్కాక పిడిగుద్దులు గుద్దుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ‘లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని నేను రాత్రీపగలు కష్టపడి అభివృద్ధి చేశా. ఈ రెండేళ్లలో మళ్లీ 30ఏళ్లు వెనక్కి జగన్ తీసుకెళ్లిపోయారు. గద్దెనెక్కాక ప్రజలకు మేలు జరగకపోయినా.. జగన్ అక్రమార్జన విపరీతంగా పెరిగిందని’ పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భవానీపురం నుంచి రోడ్‌షో ఆరంభించి.. విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు నియోజకవర్గాల్లోని అన్ని డివిజన్లలో పర్యటించి పలు కూడళ్లలో మాట్లాడారు. ‘తెదేపాను విజయవాడలో గెలిపించకపోతే రేపు ఈ ప్రాంతవాసులు తలఎత్తుకుని తిరిగే పరిస్థితి ఉండదు. జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. రాజధాని ఎక్కడికీపోదంటూ నమ్మించారు. ఈ ప్రాంత ప్రజలను అడ్డంగా మోసం చేశారు.
ఇప్పుడు మూడు రాజధానులంటూ.. మూడు ముక్కలాట ఆడుతున్నారు. రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారు. వైకాపాకు ఓటు వేస్తే.. మూడు రాజధానులకు మద్దతు తెలిపినట్టేనని గుర్తుంచుకోవాలి. నాపై అభిమానం చూపించాల్సిన అవసరం లేదు. మీ బిడ్డల భవిష్యత్తు కోసమైనా.. ఆలోచించండి. విజయవాడలో ఇంటికో మనిషి బయటకొచ్చి ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడలేరా..?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘విజయవాడ నగర మేయర్ ఎన్నికల్లో తెదేపాను గెలిచినంత మాత్రాన నాకు వచ్చేదేమీ లేదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది. మరోసారి మోసపోవద్దని హెచ్చరించడానికి వచ్చాను. అమరావతి రాజధానిగా ఆమోదయోగ్యమో కాదో ఓటు ద్వారా చెప్పండి. రాజధానిలో రూ.6లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ తెగ ప్రచారం చేశారు. వాళ్లు అధికారంలోకి వచ్చాక ఆరు పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. అదీ నా విశ్వసనీయత. చైతన్యవంతులైన పట్టణ ప్రజలు ఇచ్చే తీర్పు జగన్ దుష్ట పాలన అంతానికి ఆరంభం కావాలని’ చంద్రబాబు పేర్కొన్నారు.
నేను ఆ రౌడీలకే రౌడీని.
‘రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ద రౌడీ అయితే.. నేను ఆ రౌడీలకే రౌడిని. వాళ్ల గుండెల్లో నిద్రపోతా. మరొకరు బూతుల మంత్రి. ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకొని వచ్చి.. పేకాటాడితే తప్పేంటని బహిరంగంగానే అంటారు. అమ్మవారి ఆలయంలో కొబ్బరి చిప్పలు, చీరలు అమ్ముకునే వ్యక్తి స్థానిక మంత్రి. రాముడి తల నరికినా, వెండి సింహాలు చోరీకి గురైనా ఆయనకు పట్టదు. అవినీతి కంపుతో విజయవాడ ప్రతిష్ఠను దిగజార్చారు. ఈ దోపిడీ ప్రభుత్వం పోవాలంటే కనకదుర్గమ్మ కన్నెర్ర చేయాలని’ చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎవరైనా నోరెత్తితే శుక్రవారం సాయంత్రం ప్రజల ఇళ్ల వద్దకు పొక్లెయిన్‌లను పంపించి విధ్వంసం సృష్టిస్తున్నారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే మూకుమ్మడిగా పోలీస్‌స్టేషన్ల ముందు ధర్నాలు చేద్దాం. జగన్, మంత్రులకు భయపడాల్సిన పనిలేదు. తిరగబడాల్సిన సమయం వచ్చింది. మీ అందరి కోసం నేను పోరాడతానని’ చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.