కరోనా మృతులకు ప్రభుత్వం ఏం సాయం చేసిందో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరోనా నివారణకు ముందస్తు చర్యలు ఏం తీసుకున్నారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్‌కు పెట్టిన ఆర్డర్లు, చేసిన చెల్లింపులు, కరోనా బాధితులకు ఇచ్చిన సాయం తదితరాలపై వెంటనే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ముఖ్య నేతలు, మండలాధ్యక్షులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ వేసేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనాతో చనిపోయిన వారికి ఆర్థిక సాయం అందించాలి
కరోనా మృతుల దహన సంస్కారాలకు రూ.15 వేల సాయం ప్రకటించి అమలు చేయకపోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. కరోనా మృతులకు ఉచితంగా, గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. అన్న క్యాంటీన్లను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు..రూ. 10 లక్షల ఆర్థికసాయం, ఇతర కరోనా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల పనులు కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, పేదలకు రూ.10వేలు ఆర్థికసాయం అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు.