చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు సురేశ్‌బాబుపై హత్యాయత్నం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. ఈ విషయంపై స్పందించి... కుప్పంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ.. ఎస్ఈసీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలపై విచారణ జరపాలన్నారు.
'తెదేపా మద్దతుతో పోటీ చేస్తే.. పొలాలు నాశనం చేస్తారా?'
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్నా... వైకాపా నేతలకు సిగ్గు రావట్లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. పులివెందుల నియోజకర్గంలో పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుతో పోటీ చేసిన నేతల పొలాలను నాశనం చేయటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. విధ్వంసం, విద్వేషాలతో రాష్ట్రాన్ని వైకాపా నేతలు రావణకాష్టం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలెంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు తెదేపా నేతలను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.