సామాజిక మాధ్యమాల్లో తెదేపా కార్యకర్తలు క్రియాశీలంగా వ్యవహరించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. యువత ఇందులో ప్రధాన పాత్ర పోషించాలన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 'ఐ టీడీపీ' కార్యకర్తలతో చంద్రబాబు శనివారం సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల అక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లామని, భవిష్యత్తులోనూ ఇలాగే స్పందించాలని సూచించారు. ఎన్నికలప్పుడు బయటి ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురి చేయడానికి వస్తే ఫొటోలు తీయాలన్నారు. కార్యకర్తలను వేధించే పోలీసులు, అధికారుల తీరును ఎండగట్టాలని సూచించారు. అధికార పార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా చేసే అసత్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు కలసి పనిచేస్తే పురపాలక ఎన్నికల్లో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిషత్ ఎన్నికల సమయంలో కార్యకర్తలకు అండగా ఉండటానికి కుప్పం నియోజకవర్గానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వస్తారని తెలిపారు. నెలకోసారి కుప్పం నియోజకవర్గానికి పార్టీ ముఖ్య నేత ఒకరు వస్తారని వెల్లడించారు.
పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాలి: డీజీపీకి చంద్రబాబు లేఖ