సముద్రంలో చేపల వేటకు వెళ్లి కనిపించకుండాపోయిన కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన నలుగురు జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని సీఎస్ సమీర్ శర్మను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈమేరకు సీఎస్‌కు చంద్రబాబు లేఖ రాశారు. వేటకెళ్లిన మత్య్సకారులు గల్లంతుకావడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. వేటగాళ్ల ఆచూకీ కనిపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అవసరమైతే లాంగ్ రేంజ్ డ్రోన్‌లతో గాలించాలని సూచించారు.
మత్స్యకారులు తప్పిపోయి నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని చంద్రబాబు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం స్థానిక జాలర్లు రెండు బోట్లు వేసుకుని సముద్రంలో గాలించినా ఎలాంటి ఉపయోగమూ లేకపోయిందని చంద్రబాబు వాపోయారు. జాలర్ల గల్లంతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వెంటనే వారి ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.