CBN Launched E-Paper:స్వతంత్రంగా పనిచేసే మీడియాపైనా ఆంక్షలు విధించి ప్రభుత్వం తన గుప్పిట్లోకి తీసుకుంటోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో లేకుంటే తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో నడిచే చైతన్య రథం ఈ-పేపర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరూ వార్తలు రాయకూడదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. కొంతమంది అవినీతి డబ్బుతో పేపర్, ఛానెల్ పెట్టినా.. తెలుగుదేశం ఎప్పుడూ సొంత మీడియా ఏర్పాటు దిశగా ఆలోచన చేయలేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు ,ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధంగా ఈ చైతన్య రథం పని చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కనకమేడల రవీంద్ర కుమార్, చినరాజప్ప, గన్ని వీరాంజనేయులు, జోగేశ్వరరావు, టీడీ జనార్దన్, చింతకాయల విజయ్, పంచుమర్తి అనురాధ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణంపై నోరు మెదపరెందుకు ?
సినిమా టిక్కెట్ల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి..భవన నిర్మాణంపై ఎందుకు మాట్లాడటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. సొంత సిమెంట్ కంపెనీ ఉంది కాబట్టి ఇష్టానుసారం ధరలు పెంచుకుంటున్నారన్న ఆయన.., భారతీ సిమెంట్ ధరలు పెంచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ జగన్ పీడిత బాధితులేనన్నారు. రైతులు, ఉద్యోగస్తులు, వాహనదారులు ఇలా అన్ని వర్గాల వారు మోసపోయి దగాపడ్డారన్నారు. అన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అరాచక పాలనలో రాష్ట్రంలో సంక్రాంతి శోభ లేక కళ తప్పిందన్నారు. ప్రజా చైతన్యం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇది 5 కోట్ల మంది తెలుగు ప్రజల బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.
చిరంజీవి పార్టీ పెట్టకుంటే ఆనాడే అధికారంలోకి వచ్చే వాళ్లం..