ఉగ్రవాదులను మించిన పాలన వైకాపాది అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. సర్పంచ్‌లకు అధికారం లేకుండా చేశారని.. హక్కుల కోసం వారు చేసే పోరాటానికి తెదేపా మద్దతిస్తుందని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపాకు చెందిన రాయలసీమ ప్రాంత జిల్లాల సర్పంచ్‌ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
"గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. వైకాపా ప్రభుత్వం సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసింది. సర్పంచులకు రాజ్యాంగం అధికారాలను ఇచ్చింది. రాజ్యాంగ హక్కులను జగన్ హరిస్తున్నారు. సర్పంచుల అధికారాలను తీసుకోవడానికి ఆయన ఎవరు ? ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారం చేయకుండా కూడా చేశారు. అయినా.. తెదేపా తరఫున బరిలో దిగి పోరాడి గెలిచారు." - చంద్రబాబు, తెదేపా అధినేత
అన్నా.. అంటూనే పదవి ఊడగొట్టారు!
మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యంను "అన్నా" అంటూ శుభ్రంగా బాపట్ల పంపారని.. ఇప్పుడు గౌతమ్ సవాంగ్‌ను కూడా "అన్నా" అంటూనే డీజీపీ పదవి నుంచి పీకేశారని ముఖ్యమంత్రి జగన్‌పై చంద్రబాబు వ్యంగ్యస్త్రాలు సంధించారు.