ఎమ్మెల్సీ అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎక్కడ అన్యాయం జరిగినా.. పరిష్కారం కోసం అక్కడ తెదేపా ఉంటుందన్నారు. తప్పుడు సీఐడీ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అశోక్బాబును విజయవాడ పటమటలోని ఆయన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. సీఐడీ అరెస్టు తదనంతర పరిణామాలపై ఆరా తీశారు. సీబీఐ కస్టడీలో తన కేసు విషయం కంటే ఉద్యోగుల సమ్మె అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించారని అశోక్ బాబు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.
వైకాపా ప్రభుత్వం ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తుందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేయటంతోపాటు 33 మంది తెదేపా నేతలను హత్య చేశారన్నారు. అన్యాయం జరిగిన ప్రతీ ఒక్కరి పక్షాన పోరాడి వైకాపా ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు. మూడేళ్లకే జగన్‌కు అంత ఉంటే.. 14ఏళ్లు సీఎంగా చేసిన తనకెంత ఉండాలని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు బాధపడినట్లే.. రేపు అనేది ఒకటుందని గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోరని అన్నారు.
"అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారు. ఎక్కడ అన్యాయం జరిగినా..పరిష్కారం కోసం అక్కడ తెదేపా ఉంటుంది. ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారు. 33 మంది తెదేపా నేతలను హత్య చేశారు. వైకాపా ప్రభుత్వం.. ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తోంది. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరి పక్షానా పోరాడి వైకాపా ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతాం. మూడేళ్లకే జగన్‌కు అంత ఉంటే .. 14ఏళ్లు సీఎంగా చేసిన నాకెంత ఉండాలి. తెలుగుదేశం కార్యకర్తలు బాధపడినట్లే.. రేపు అనేది ఒకటుందని గుర్తుపెట్టుకోండి. తప్పు చేసే ప్రతీ అధికారి తప్పించుకోలేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగనివ్వబోం." - చంద్రబాబు,తెదేపా అధినేత