ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నులు వేస్తూ, ఛార్జీలు పెంచుతూ ప్రజలను పీక్కుతుంటున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే కరెంట్ ఛార్జీలు, చెత్త పన్నులు, ప్రాపర్టీ టాక్స్లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. ఇలాంటి సమయంలో పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కవగా వినియోగించే ప్రజా రవాణా ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం తన 'బాదుడే బాదుడు' కార్యక్రమంతో రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తరువాత సంస్థకు అండగా నిలవాల్సింది ప్రభుత్వమేనన్న చంద్రబాబు.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"'బాదుడే బాదుడు' చర్యలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం. డీజిల్ సెస్ పేరుతో చేసిన ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలి. అధికారంలోకి వచ్చాక రెండోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. విలీనం అయ్యాక ఆర్టీసీకి అండగా నిలవాల్సింది ప్రభుత్వమే. ప్రతి వారం ఛార్జీలు, పన్నులు పెంచడం అలవాటుగా మారింది. ఇప్పటికే విద్యుత్, చెత్త, ప్రాపర్టీపై పన్నుల భారం వేశారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు." -చంద్రబాబు, తెదేపా అధినేత